Kandula Durgesh: ఏపీ సినిమాటోగ్రఫీలో నూతన శకం ప్రారంభం: మంత్రి కందుల దుర్గేశ్

Kandula Durgesh Announces New Era for AP Cinematography
  • ముంబైలో జరిగిన సీఐఐ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేశ్ 
  • ఏపీని దేశంలోనే ఉత్తమ సినిమా షూటింగ్ ప్రదేశంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
  • ప్రపంచస్థాయిలో తెలుగు సినిమా ఒక గ్లోబల్ బ్రాండ్‌గా నిలుస్తోందని వ్యాఖ్య
  • రాష్ట్ర సినిమాటోగ్రఫీలో ఒక నూతన శకం ప్రారంభమైందని స్పష్టం
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే సినిమా షూటింగ్‌లకు అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఒక గ్లోబల్ బ్రాండ్‌గా గుర్తింపు పొందుతున్న ఈ తరుణంలో, రాష్ట్ర సినిమాటోగ్రఫీ రంగంలో ఒక నూతన శకం ప్రారంభమైందని ఆయన అన్నారు.

ముంబైలో జరుగుతున్న 'సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ - 2025'లో సోమవారం ఆయన పెట్టుబడిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలుగు చిత్ర పరిశ్రమ సాధిస్తున్న విజయాలను ప్రస్తావిస్తూ, ఏపీలో సినిమా నిర్మాణానికి ఉన్న అపార అవకాశాలను వివరించారు. రాష్ట్రంలో సినీ నిర్మాణ కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

చిత్రీకరణలకు అవసరమైన సులభమైన అనుమతులు, మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఏపీని సినీ పరిశ్రమకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుస్తామని మంత్రి దుర్గేశ్ తెలిపారు. ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి సినీ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"ఏపీ సినిమాటోగ్రఫీ రంగంలో నూతన శకానికి శ్రీకారం చుడుతూ, ముంబయిలో జరుగుతున్న ‘సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ – 2025’లో ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి కాటా గారితో కలిసి పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను ఇన్వెస్టర్లకు వివరించాను. తెలుగు చిత్ర పరిశ్రమ ఈరోజు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఇండస్ట్రీగా నిలదొక్కుకొని, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, పుష్ప, కల్కి 2898 AD వంటి బ్లాక్‌బస్టర్‌లతో తెలుగు సినిమాను గ్లోబల్ బ్రాండ్‌గా మార్చిన తీరును ఈ సందర్భంగా గుర్తు చేశాను. ఏపీలో 1,100 పైగా సినీ స్క్రీన్లు ఉండటం మన రాష్ట్రం సినీ రంగానికి ఎంత ముఖ్యమైన కేంద్రంగా ఎదిగిందో తెలిపే ఉదాహరణ.

తెలుగు సినిమా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు త్వరలోనే సమగ్రమైన కొత్త ‘ఫిల్మ్ టూరిజం పాలసీ’ని ఆవిష్కరించనున్నట్లు ఇన్వెస్టర్లకు తెలియజేశాను. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, ఆధునిక స్టూడియోలు, డబ్బింగ్ మరియు రీ-రికార్డింగ్ సౌకర్యాల నిర్మాణానికి ప్రభుత్వం సంపూర్ణమైన మద్దతు అందిస్తుందని స్పష్టం చేశాను. షూటింగ్‌ల కోసం ప్రభుత్వ మరియు బహిరంగ ప్రాంతాల్లో అనుమతులు వేగంగా, పారదర్శకంగా లభించే విధంగా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాం. అలాగే కళాకారులు, సాంకేతిక నిపుణులను గౌరవించేందుకు ప్రతిష్ఠాత్మక నంది అవార్డులు మరియు నంది నాటకోత్సవాలను త్వరలోనే పునరుద్ధరించనున్నట్లు ప్రకటించాను.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో జరిగిన సమావేశాల్లో వివరించాను. పర్యాటక, ఆతిథ్య రంగాలకు ‘ఇండస్ట్రీ స్టేటస్’ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం భూమి కొనుగోలు/లీజుపై 100 శాతం స్టాంప్ డ్యూటీ రీయింబర్స్‌మెంట్, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జీల మినహాయింపు, 15 సంవత్సరాలకు 100 శాతం SGST రీయింబర్స్‌మెంట్ వంటి లాభదాయకమైన రాయితీలను కల్పిస్తున్నట్లు తెలియజేశాను. 

స్వర్ణాంధ్ర విజన్–2047 లో భాగంగా, AI, VFX, గేమింగ్ రంగాలను అభివృద్ధి చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆంధ్రా వ్యాలీ’గా తీర్చిదిద్దే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. సినిమాటోగ్రఫీని, పర్యాటకాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని సమన్వయం చేస్తూ ఏపీ అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కృషి చేస్తున్నాం. విశాఖపట్నం, అరకు, లంబసింగి, శ్రీశైలం, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాలను ప్రధాన యాంకర్ హబ్‌లుగా అభివృద్ధి చేస్తూ 21 థీమాటిక్ సర్క్యూట్‌లలో పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం.

సమ్మిట్‌లో భాగంగా సోనీ, యూట్యూబ్ ఇండియా, క్యూబ్ సినిమా, ఇమాజికా వరల్డ్, థామస్ కుక్ వంటి ప్రముఖ సంస్థల మరియు సీఐఐ ప్రతినిధులతో సమావేశమై ఏపీలో పెట్టుబడులకు ఉన్న విస్తృత అవకాశాలపై చర్చించాము. మీడియా & ఎంటర్టైన్‌మెంట్ రంగ భవిష్యత్తు వృద్ధికి ఏపీ కీలకంగా నిలుస్తుందని నమ్ముతున్నాం. బాధ్యతాయుతమైన, పారదర్శకమైన, వ్యాపార అనుకూలమైన పాలనతో భారతీయ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ రంగాన్ని $100 బిలియన్ స్థాయికి తీసుకెళ్లే ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంటుందని విశ్వసిస్తున్నాను" అని కందుల దుర్గేశ్ వివరించారు.
Kandula Durgesh
Andhra Pradesh
AP Film Tourism Policy
CII Big Picture Summit 2025
Telugu Cinema
Film Industry Investments
Tourism Andhra Pradesh
AP Tourism
Nandi Awards
Film City

More Telugu News