WHO: ఒబేసిటీ సమస్య మందులతో పోయేది కాదు: డబ్ల్యూహెచ్ఓ

WHO Obesity Not Solved by Medication Alone
  • స్థూలకాయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా మార్గదర్శకాలు
  • జీఎల్పీ-1 మందులు మాత్రమే సమస్యకు పరిష్కారం కాదని స్పష్టం
  • మందులతో పాటు ఆహార నియమాలు, వ్యాయామం కూడా ముఖ్యమనని సూచన
  • ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని వెల్లడి
  • ఈ మందుల డిమాండ్‌తో నకిలీ ఉత్పత్తులు పెరిగాయని ఆందోళన
ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మరణాలకు కారణమవుతున్న స్థూలకాయం (ఒబేసిటీ) సమస్యపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఊబకాయం చికిత్సలో వాడుతున్న గ్లూకాగాన్-లైక్ పెప్టైడ్-1 (జీఎల్పీ-1) రకం మందులు సమర్థవంతమైనవే అయినప్పటికీ, కేవలం వాటితోనే ఈ ప్రపంచ ఆరోగ్య సంక్షోభాన్ని పరిష్కరించలేమని సోమవారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. మందులతో పాటు జీవనశైలి మార్పులు కూడా అంతే ముఖ్యమని తేల్చిచెప్పింది.

ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. పెద్దవారిలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉండటాన్ని స్థూలకాయంగా పరిగణిస్తారు. దీని చికిత్స కోసం లిరాగ్లుటైడ్, సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి జీఎల్‌పీ-1 మందుల వాడకానికి డబ్ల్యూహెచ్ఓ షరతులతో కూడిన సిఫార్సులు చేసింది. ఈ మందులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంతో పాటు బరువు తగ్గడానికి, గుండె, కిడ్నీ సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

అయితే, ఈ మందులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా పెరగడంతో నకిలీ, నాణ్యతలేని ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో రోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మార్గదర్శకాలను విడుదల చేసింది.

"స్థూలకాయం ఒక దీర్ఘకాలిక వ్యాధి. దీనికి సమగ్రమైన చికిత్స అవసరం. కేవలం మందులతోనే ఈ సమస్యను అధిగమించలేం. అయితే, లక్షలాది మందికి చికిత్సలో జీఎల్పీ-1 మందులు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయి" అని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు.

ఈ మందులు వాడే వ్యక్తులు తప్పనిసరిగా ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రమం తప్పని వ్యాయామం వంటి జీవనశైలి మార్పులను అనుసరించాలని, ఆరోగ్య నిపుణుల పర్యవేక్షణలో ఉండాలని గైడ్‌లైన్స్‌లో స్పష్టం చేశారు. స్థూలకాయం వల్ల గుండె జబ్బులు, టైప్-2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ఈ సమస్యకు పరిష్కార మార్గాలు కనుగొనకపోతే 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా 3 ట్రిలియన్ డాలర్ల భారం పడుతుందని అంచనా వేసింది.
WHO
Obesity
World Health Organization
GLP-1
Tedros Adhanom Ghebreyesus
Weight Loss
Diabetes
Public Health
Global Health Crisis
Obesity Treatment

More Telugu News