Chandrababu Naidu: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కేసులు.. ఆరా తీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

Chandrababu Naidu Inquires About Diarrhea Cases in Srikakulam
  • జిల్లాలోని సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు
  • గ్రామంలోని పరిస్థితిని వివరించిన వైద్యారోగ్య శాఖ అధికారులు
  • గ్రామంలో ఎక్కడా కలుషిత నీరు లేదని తేలిందని వెల్లడి
శ్రీకాకుళం జిల్లా, సంతబొమ్మాళి మండలం, తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. గ్రామంలోని పరిస్థితిని వైద్యారోగ్య శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తాళ్లవలస గ్రామంలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు వ్యక్తులు అస్వస్థతకు గురవగా వారిని టెక్కలి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సోమవారం మరో ముగ్గురు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

బాధితులంతా వేర్వేరు కుటుంబాలకు చెందినవారని, ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స తీసుకుంటున్నారని, వారు కోలుకుంటున్నారని తెలిపారు. ఇందులో ముగ్గురు డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. చిన్నారావు (70) అనే వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. చిన్నారావు మృతికి డయేరియా కారణం కాదని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిన్నారావు మూత్రపిండాల వ్యాధితో బాధపడేవాడని, మల్టీ ఆర్గాన్ డిస్-ఫంక్షన్ వల్ల గుండెపోటు వచ్చి మృతి చెందాడని వైద్యులు నిర్ధారించినట్లు అధికారులు తెలిపారు.

గ్రామంలో ఒక బావి ద్వారా 5 పబ్లిక్ కుళాయిలకు, మరో 2 చేతి పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ద్వారా ఈ నీటిని పరీక్షించగా ఎక్కడా కలుషితం లేదని, నీరు తాగడానికి సురక్షితమేనని తేలిందని అధికారులు చెప్పారు. అయినప్పటికీ, ముందు జాగ్రత్త చర్యగా బావి నుంచి నీటి సరఫరాను నిలిపివేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

జిల్లా పంచాయతీ అధికారి, ఎస్ఈ (ఆర్‌డబ్ల్యూఎస్) క్షేత్రస్థాయిలోనే ఉండి పారిశుద్ధ్యం, నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డయేరియా ప్రబలడానికి గల అసలు కారణాన్ని కనుగొనేందుకు డిప్యూటీ డీఎంహెచ్ఓ, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు.

తాళ్లవలస గ్రామస్థులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్రామస్థులకు సరఫరా అయ్యే నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనేది విశ్లేషించాలని సూచించారు. గ్రామస్థులందరికీ సురక్షితమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవడంతోపాటు సమీప గ్రామాలపైనా దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
Chandrababu Naidu
Srikakulam
diarrhea cases
Tallavalasa village
Andhra Pradesh

More Telugu News