Raj Nidimoru: సమంత భర్త రాజ్ నిడిమోరు ఎవరు? ఆయన గురించి ఆసక్తికర విషయాలు!

Who is Samanthas husband Raj Nidimoru
  • రాజ్ నిడిమోరును రెండో వివాహం చేసుకున్న సమంత
  • తిరుపతిలో పుట్టిన రాజ్
  • అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పని చేస్తూ... సినీ రంగం వైపు అడుగులు
స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ రెండో వివాహం చేసుకున్నారు. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరును ఆమె ఈరోజు పెళ్లాడారు. కోయంబత్తూరులోని ఈశా కేంద్రంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో అత్యంత నిరాడంబరంగా వీరి వివాహ వేడుక జరిగింది. నిన్న రాత్రి నుంచే వీరి పెళ్లిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలవగా, ఈ మధ్యాహ్నం సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫొటోలను పోస్ట్ చేసి, తాము పెళ్లి చేసుకున్నట్టు పూర్తి స్పష్టతనిచ్చారు.

ఈ పెళ్లి వేడుకకు కేవలం 30 మంది అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో సమంత ఎర్రటి చీరలో మెరిసిపోయారు. 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' వెబ్ సిరీస్ సెట్స్‌లో కలుసుకున్న వీరిద్దరి మధ్య స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఆ తర్వాత 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్‌లో కూడా సమంత నటించడంతో వీరి బంధం మరింత బలపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి కనిపించడంతో వీరి డేటింగ్ వార్తలకు బలం చేకూరింది.

ఎవరీ రాజ్ నిడిమోరు?
రాజ్ నిడిమోరు (50) ప్రముఖ దర్శకుడు, రచయిత, నిర్మాత. తన స్నేహితుడు కృష్ణ డీకేతో కలిసి 'రాజ్ & డీకే' పేరుతో ఇండస్ట్రీలో ఎంతో గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 1975లో పుట్టిన రాజ్... ఎస్‌వీయూ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా స్థిరపడ్డారు. సినిమాపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలి, కృష్ణ డీకేతో కలిసి సినీ ప్రయాణం ప్రారంభించారు. 'గో గోవా గాన్', 'స్త్రీ', 'ది ఫ్యామీలీ మ్యాన్', 'ఫర్జీ' వంటి విజయవంతమైన ప్రాజెక్టులతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు. మీడియా అంచనాల ప్రకారం, రాజ్ నిడిమోరు ఆస్తి విలువ సుమారు రూ. 83-85 కోట్లు. ఇక సమంత ఆస్తి విలువ రూ. 100-110 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.

ఇద్దరికీ ఇది రెండో వివాహమే
సమంత (38)కు, రాజ్ నిడిమోరుకు ఇద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. నటుడు నాగచైతన్యతో 2017లో వివాహం చేసుకున్న సమంత, 2021లో విడాకులు తీసుకున్నారు. మరోవైపు, రాజ్ నిడిమోరు తన మొదటి భార్య శ్యామలికి 2022లో విడాకులు ఇచ్చారు. కాగా, రాజ్ పెళ్లి వార్తలు బయటకు రాగానే ఆయన మాజీ భార్య "నిస్సహాయ స్థితిలో ఉన్నవారు నిస్సహాయమైన పనులే చేస్తారు" అంటూ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ కొత్త జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Raj Nidimoru
Samantha Ruth Prabhu
Samantha marriage
Raj and DK
The Family Man
Citadel Honey Bunny
Shyamali Nidimoru
Telugu cinema
Divorce
Celebrity wedding

More Telugu News