Revanth Reddy: భూములపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం 'హిల్ట్' పాలసీ.. గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు

Revanth Reddy Government HILT Policy faces BJP Complaint to Governor
  • హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం
  • హిల్ట్ పాలసీలో వేల కోట్ల రూపాయల కుంభకోణం ఉందని బీజేపీ ఆరోపణ
  • హిల్ట్ పాలసీ పేరుతో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్-హెచ్ఐఎల్‌టీ) పాలసీపై తెలంగాణ బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. హిల్ట్ పాలసీ పేరుతో వేల కోట్ల రూపాయల భూకుంభకోణం జరుగుతోందని ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు నేతృత్వంలో పార్టీ ప్రతినిధుల బృందం గవర్నర్‌ను కలిసింది.

హైదరాబాద్ పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం హిల్ట్ పాలసీని అమలులోకి తెచ్చింది. హిల్ట్ పాలసీ పేరుతో భూఅక్రమాలకు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రామచందర్ రావుతో పాటు బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు ఉన్నారు.

గవర్నర్‌ను కలిసిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, హిల్ట్ పాలసీ ద్వారా అక్రమాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపుతోందని ఆరోపించారు. 9 వేల ఎకరాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. భూముల ధరలు ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత పలుకుతున్నాయి, గతంలో ఎంత ఉన్నాయో పరిశీలిస్తే అక్రమాలు చేస్తున్నట్లు అర్థమవుతోందని అన్నారు. ఇప్పటికే కోకాపేటలో భూములు ఎన్ని కోట్లు పలికాయో చూశామని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఈ నెల 7న ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపాలిటీల విలీనం ద్వారా జీహెచ్ఎంసీని విస్తరించాలనుకుంటోందని, ఇందులోనూ ఎన్నో కుట్రలు దాగి ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపించారు.
Revanth Reddy
Telangana
HILT policy
BJP
Governor
Land scam
Hyderabad
Real estate

More Telugu News