Mallikarjun Kharge: ప్రధాని మోదీనే పెద్ద నాటకాలరాయుడు: ఖర్గే, జైరాం రమేశ్ ఫైర్

Kharge slams PM Modi calls him drama king
  • శీతాకాల సమావేశాల తొలిరోజే మోదీపై విరుచుకుపడిన కాంగ్రెస్ అగ్రనేతలు
  • గత 11 ఏళ్లుగా పార్లమెంటరీ సంప్రదాయాలను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శ 
  • బిల్లులను చర్చ లేకుండానే బుల్డోజ్ చేస్తున్నారని ఆరోపణ
  • మోదీ తీరు కపటత్వమంటూ జైరాం రమేశ్ ఫైర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం వాడివేడిగా ప్రారంభమయ్యాయి. తొలిరోజే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీరుపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చ జరపకుండా, ప్రధాని మరోసారి 'నాటకానికి' తెరలేపారని ఆయన ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని చేసిన ప్రసంగాన్ని ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. "గడిచిన 11 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ గౌరవాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను నిరంతరం కాలరాస్తోంది. ఇందుకు సంబంధించిన ఘటనల జాబితా చాలా పెద్దది" అని ఖర్గే ఆరోపించారు. గత వర్షాకాల సమావేశాల్లోనే దాదాపు 12 బిల్లులను హడావుడిగా ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. కొన్ని బిల్లులను 15 నిమిషాల కన్నా తక్కువ సమయంలో, మరికొన్నింటిని అసలు చర్చ లేకుండానే పాస్ చేశారని విమర్శించారు. 'రైతు వ్యతిరేక నల్ల చట్టాలు', జీఎస్టీ, భారత పౌర భద్రతా నియమావళి వంటి వివాదాస్పద చట్టాలను పార్లమెంటులో బుల్డోజ్ చేశారని మండిపడ్డారు.

మణిపూర్‌ హింసాకాండపై పార్లమెంటులో చర్చకు పట్టుబట్టినప్పుడు, విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టే వరకు ప్రధాని మౌనంగానే ఉన్నారని ఖర్గే దుయ్యబట్టారు. ప్రస్తుతం జరుగుతున్న 'ఎస్ఐఆర్' ప్రక్రియలో పనిభారం కారణంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 'ఓట్ల దొంగతనం' వంటి తీవ్రమైన అంశాలపై పార్లమెంటులో చర్చించాలని తాము పట్టుబడుతున్నామన్నారు. ఇకనైనా బీజేపీ దారి మళ్లించే నాటకాలకు స్వస్తి పలికి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానతలు, దేశ వనరుల దోపిడీ వంటి ప్రజా సమస్యలపై చర్చించాలని హితవు పలికారు.

ఇదే అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. "ప్రధాని ఎప్పుడూ పార్లమెంటుకు హాజరుకారు, విపక్షాలతో చర్చించరు. కానీ, ప్రతి సమావేశానికి ముందు పార్లమెంట్ బయట నిలబడి దేశానికి గొప్ప సందేశాలు ఇస్తారు. సభ సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని కోరతారు. ఇదంతా కపటత్వం కాదా?" అని ప్రశ్నించారు. పార్లమెంట్ సజావుగా నడవకపోతే దానికి పూర్తి బాధ్యత ప్రధాని మొండి వైఖరిదేనని స్పష్టం చేశారు. "అందరికంటే అతిపెద్ద నాటకాలరాయుడు ప్రధానే" అంటూ జైరాం రమేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. 
Mallikarjun Kharge
PM Modi
Parliament winter sessions
JaiRam Ramesh
Congress
Indian politics
Parliament proceedings
Unemployment
Inflation
Manipur violence

More Telugu News