Harish Rao: రైతుబంధు, రుణమాఫీపై కుట్ర: రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

Harish Rao Fires on Revanth Government over Rythu Bandhu Loan Waiver
  • రేవంత్ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని హరీశ్‌ విమర్శ
  • రైతుబంధును ఒకే పంటకు కుదించే కుట్ర చేస్తున్నారని మండిపాటు
  • సోయా, మక్క రైతుల ఖాతాల్లో 48 రోజులైనా డబ్బులు జమ కాలేదని ఆరోపణ
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతు భరోసా, రుణమాఫీ, పంటల కొనుగోలు వంటి అన్ని అంశాల్లోనూ రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందని, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

గత అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు పంటలకు రైతుబంధు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు దానిని ఒకే పంటకు కుదించేందుకు కుట్ర చేస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. సుమారు 70 లక్షల ఎకరాల్లోని దీర్ఘకాలిక పంటలకు నగదు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. సోయా, మక్క పంటలను కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు వేస్తామని చెప్పి, 48 రోజులు గడిచినా రైతుల ఖాతాల్లో జమ చేయలేదని విమర్శించారు. గత యాసంగికి సంబంధించిన రూ.1,150 కోట్ల సన్న వడ్ల బోనస్‌ను కూడా వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

సంగారెడ్డి జిల్లాపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టుల నిర్మాణాలను ఈ ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుల పనులు వెంటనే ప్రారంభించకపోతే, త్వరలోనే తాను పాదయాత్ర చేపడతానని హెచ్చరించారు. నారాయణఖేడ్‌లో 8 కొత్త చెరువులకు భూసేకరణ పూర్తయినా పనులు మొదలుపెట్టలేదని, దీనిపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అనంతసాగర్‌, సిర్గాపూర్‌లలో జరిగిన మల్లన్న జాతర ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా హరీశ్‌రావు ఈ వ్యాఖ్యలు చేశారు. 
Harish Rao
Telangana
Rythu Bandhu
loan waiver
farmers
Revanth Reddy
agriculture
crop procurement
Sangaeshwara Basaveshwara projects
Narayankhed

More Telugu News