Virat Kohli: టెస్టులకు ఇక సెలవు.. ఒక్క ఫార్మాట్‌కే పరిమితం: విరాట్ కోహ్లీ కీలక ప్రకటన

Virat Kohli Sticking to One Format Cricket
  • టెస్టు రిటైర్మెంట్‌పై ఊహాగానాలకు ఫుల్‌స్టాప్ పెట్టిన విరాట్ కోహ్లీ
  • ఇకపై కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టీకరణ 
  • ఎక్కువ సన్నద్ధత కంటే మానసిక దృఢత్వమే ముఖ్యమని వెల్లడి
  • దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని పరోక్ష సంకేతాలు
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన భవిష్యత్ ప్రణాళికలపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించాడు. ఇకపై తాను కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడతానని స్పష్టం చేశాడు. టెస్టు క్రికెట్‌లోకి తిరిగి వస్తాడంటూ మీడియాలో వస్తున్న వార్తలను తోసిపుచ్చాడు. అద్భుతమైన సెంచరీతో జట్టును గెలిపించిన అనంతరం మాట్లాడిన కోహ్లీ, పలు కీలక విషయాలపై పరోక్షంగా సమాధానాలిచ్చాడు.

మ్యాచ్ అనంతరం ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న కోహ్లీ తన సన్నద్ధతపై స్పందించాడు. ‘‘నేను ఎక్కువ ప్రాక్టీస్ లేదా సన్నద్ధతను నమ్మను. నా క్రికెట్ అంతా మానసికమైనదే. నేను మానసికంగా ఉత్సాహంగా ఉన్నంత కాలం రాణించగలను’’ అని బ్రాడ్‌కాస్టర్‌తో చెప్పాడు. ఈ వ్యాఖ్యల ద్వారా, సెలెక్టర్లు కోరుకుంటున్నట్లు దేశవాళీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో ఆడాల్సిన అవసరం లేదని పరోక్షంగా సూచించాడు.

తన ఫిట్‌నెస్ గురించి మాట్లాడుతూ ‘‘నేను ప్రతిరోజూ శారీరకంగా చాలా కష్టపడతాను. అది నా జీవనశైలిలో భాగం. క్రికెట్‌తో దానికి సంబంధం లేదు. ఫిట్‌నెస్ స్థాయులు, మానసిక ఉత్సాహం ఉన్నప్పుడు మ్యాచ్‌కు సిద్ధంగా ఉన్నట్లే’’ అని వివరించాడు. ఆదివారం నాటి మ్యాచ్‌లో 120 బంతుల్లో 135 పరుగులు చేసిన తీరు, అతని మాటలకు నిదర్శనంగా నిలిచింది.

300కి పైగా వన్డేలు ఆడిన అనుభవం తనకు ఉందని, ఫామ్‌లో ఉన్నంత కాలం నెట్స్‌లో గంటన్నర సాధన చేస్తే సరిపోతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ‘‘నాకు ఇప్పుడు 37 ఏళ్లు. కాబట్టి ఆట తర్వాత రికవరీకి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని తన వయసును గుర్తుచేసుకున్నాడు. తాను ఆడే ప్రతి గేమ్‌ను 120 శాతం ఆస్వాదిస్తూ ఆడతానని, అదే తన విజయ రహస్యమని కోహ్లీ వెల్లడించాడు.
Virat Kohli
Virat Kohli retirement
Virat Kohli One Day Internationals
Indian Cricket
Cricket ODI
Vijay Hazare Trophy
Indian Cricket Team
Kohli fitness
Kohli century
Kohli future plans

More Telugu News