Elon Musk: నా కుమారుడి పేరులో 'శేఖర్'... భారతీయ మూలాలపై ఎలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు

Elon Musk Reveals Sons Name Honors Indian Nobel Laureate
  • తన భాగస్వామి శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలున్నాయని వెల్లడించిన మస్క్
  • నోబెల్ గ్రహీత చంద్రశేఖర్ గౌరవార్థం కుమారుడికి 'శేఖర్' అని పేరు పెట్టినట్లు వెల్లడి
  • శివోన్ కెనడాలో పెరిగాడని, ఆమె పూర్వీకులు భారతీయులన్న మస్క్
టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. తన భాగస్వామి, న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్ అయిన శివోన్ జిలిస్‌కు భారతీయ మూలాలున్నాయని, వారి కుమారుల్లో ఒకరికి నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతికి చెందిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ గౌరవార్థం 'శేఖర్' అని మధ్య పేరుగా పెట్టామని వెల్లడించారు.

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన 'పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్' అనే పాడ్‌కాస్ట్‌లో మస్క్ ఈ విషయాలు తెలిపారు. ‘‘నా భాగస్వామి శివోన్ సగం భారతీయురాలు. ఆమెతో నాకు కలిగిన కుమారుల్లో ఒకరి మధ్య పేరు శేఖర్. చంద్రశేఖర్ గౌరవార్థం ఆ పేరు పెట్టాం’’ అని మస్క్ వివరించారు. నక్షత్రాల పరిణామ క్రమంపై చేసిన విశేష పరిశోధనలకు గానూ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.

శివోన్ జిలిస్ భారతదేశంలో ఎప్పుడైనా నివసించారా? అని అడగ్గా, ఆమెకు పూర్వీకుల ద్వారానే భారత్‌తో సంబంధం ఉందని, ఆమె కెనడాలోనే పెరిగారని మస్క్ స్పష్టం చేశారు. ఆమె చిన్నతనంలోనే దత్తతకు వెళ్లారని, పూర్వీకుల గురించి తనకు పూర్తి వివరాలు తెలియవని అన్నారు.

శివోన్ జిలిస్ చాలాకాలంగా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల్లో నిపుణురాలిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇదే పాడ్‌కాస్ట్‌లో మస్క్ మాట్లాడుతూ, అమెరికా అభివృద్ధికి భారత సంతతి ప్రజలు ఎంతో మేలు చేశారని, ప్రతిభావంతులైన భారతీయుల రాకతో అమెరికా అపారంగా లబ్ధి పొందిందని ప్రశంసించారు.
Elon Musk
Shivon Zilis
Subrahmanyan Chandrasekhar
Indian origin
Nobel Prize
SpaceX
Neuralink
निखिल कामत
Zerodha

More Telugu News