Virat Kohli: కోహ్లీ సూపర్ సెంచరీ... రాంచీలో టీమిండియా పరుగుల జాతర

Virat Kohlis Century India Scores Big in Ranchi ODI
  • రాంచీ వన్డేలో పరుగుల వరద
  • దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం
  • అద్భుత సెంచరీతో కదం తొక్కిన విరాట్ కోహ్లీ
  • రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధశతకాలతో రాణింపు
  • సఫారీల ముందు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన టీమిండియా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది. రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో భారత బ్యాటర్లు పరుగుల వరద పారించారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (135) అద్భుత శతకంతో కదం తొక్కగా, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (57), కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) బాధ్యతాయుతమైన అర్ధశతకాలతో రాణించారు. దీంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్, నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. 

టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా, భారత ఇన్నింగ్స్‌కు ఆశించిన ఆరంభం లభించలేదు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (18) దూకుడుగా ఆడే క్రమంలో నాలుగో ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సఫారీ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో రోహిత్ 51 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి కీలక భాగస్వామ్యానికి పునాది వేశాడు. రెండో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 136 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

రోహిత్ ఔటైన తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ (8), వాషింగ్టన్ సుందర్ (13) తక్కువ స్కోర్లకే వెనుదిరిగడంతో భారత్ కాస్త తడబడినట్లు కనిపించింది. అయితే, క్రీజులో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ.. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి మరోసారి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కోహ్లీ తన క్లాస్ బ్యాటింగ్‌తో అలరించి 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్లతో 135 పరుగులు చేసి భారత స్కోరును 300కు చేరువ చేశాడు. మరోవైపు, కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆఖర్లో రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో టీమిండియా భారీ స్కోరు సాధించగలిగింది.

దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్ల ధాటికి తేలిపోయారు. మార్కో యన్సెన్, నాండ్రే బర్గర్, కార్బిన్ బాష్, ఒట్నీల్ బార్ట్‌మన్ తలా రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ, ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్ ప్రిణెలన్ సుబ్రాయెన్ వికెట్ తీయకుండా 73 పరుగులు ఇచ్చాడు. 
Virat Kohli
India vs South Africa
Virat Kohli Century
Rohit Sharma
KL Rahul
Ranchi ODI
India batting
Indian Cricket Team
JSC International Stadium
Cricket

More Telugu News