Rohit Sharma: వన్డేల్లో రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. అఫ్రిది రికార్డు తెరమరుగు

Rohit Sharma New Record in ODIs Surpasses Afridi Record
  • వన్డే క్రికెట్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మ
  • పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది రికార్డు బద్దలు
  • అఫ్రిది కంటే 100 ఇన్నింగ్స్‌లు వేగంగా ఈ ఘనత సాధించిన హిట్‌మ్యాన్
  • ఈ మ్యాచ్‌లో 57 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రోహిత్
భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్లు (352) బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న రికార్డును 'హిట్‌మ్యాన్' అధిగమించాడు. ఇవాళ దక్షిణాఫ్రికాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు అఫ్రిది (351 సిక్సర్లు) రికార్డును సమం చేయడానికి రోహిత్‌కు రెండు సిక్సర్లు అవసరమయ్యాయి. ఆఫ్ స్పిన్నర్ ప్రినిలాన్ సుబ్రాయెన్ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ షాట్లతో అఫ్రిది రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత మార్కో జాన్‌సెన్ బౌలింగ్‌లో తన ఫేవరెట్ పుల్ షాట్‌తో మరో సిక్సర్ బాది ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నాడు.  38 ఏళ్ల వయసులోనూ తనదైన శైలిలో బ్యాటింగ్ కొనసాగిస్తూ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. విశేషమేమిటంటే, అఫ్రిది కంటే దాదాపు 100 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి రోహిత్ ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం.

ఈ మ్యాచ్‌లో ఆరంభంలోనే 1 పరుగు వద్ద టోనీ డి జోర్జి క్యాచ్ జారవిడచడంతో రోహిత్‌కు లైఫ్ లభించింది. ఆ తర్వాత విరాట్ కోహ్లీతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నిలదొక్కుకున్నాక బౌండరీలతో విరుచుకుపడ్డాడు. రికార్డు సాధించిన తర్వాత దూకుడుగా ఆడుతూ యన్‌సెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కోహ్లీతో చర్చించినా డీఆర్‌ఎస్ తీసుకోకుండా పెవిలియన్‌కు చేరాడు. మొత్తం 51 బంతులాడిన రోహిత్ 5 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు చేశాడు. ఈ రికార్డుతో క్రిస్ గేల్, ధోనీ, జయసూర్య వంటి దిగ్గజాల సరసన రోహిత్ అగ్రస్థానంలో నిలిచాడు.
Rohit Sharma
Rohit Sharma record
Shahid Afridi
South Africa ODI
Cricket records
Most sixes ODI
Hitman
Virat Kohli
Cricket

More Telugu News