Sri Lanka crisis: శ్రీలంక సంక్షోభం: సముద్రం దాటి తమిళనాడుకు భారీగా వస్తున్న శ్రీలంక తమిళులు

Sri Lankan Tamils fleeing to Tamil Nadu amid economic crisis
  • శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో తమిళనాడుకు పెరుగుతున్న వలసలు
  • సముద్ర మార్గంలో అక్రమంగా చేరుకుంటున్న తమిళ కుటుంబాలు
  • శరణార్థులకు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తున్న ప్రభుత్వం
  • రాష్ట్రవ్యాప్తంగా 110 శిబిరాల్లో 65 వేల మందికి పైగా శరణార్థులు
శ్రీలంకలో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం అక్కడి తమిళుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో కనీసం కడుపు నింపుకోలేని దుస్థితిలో పలు కుటుంబాలు సముద్ర మార్గంలో అక్రమంగా తమిళనాడుకు శరణార్థులుగా తరలివస్తున్నాయి. ఇలా వస్తున్న వారికి తమిళనాడు ప్రభుత్వం అండగా నిలుస్తూ, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం కల్పిస్తోంది.

శ్రీలంకలో 2021 నుంచి మొదలైన ఆర్థిక సంక్షోభం ప్రజల బతుకులను అతలాకుతలం చేసింది. కోడి గుడ్డు ధర రూ.35, లీటరు పాలు రూ.1,195, కిలో పాల పొడి రూ.1,945కు చేరడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. పసిపిల్లలకు పాలు కూడా పట్టలేని దుస్థితిలో, ఉన్న ఆస్తులు అమ్ముకుని మరీ అనేక కుటుంబాలు ప్రాణాలను పణంగా పెట్టి తమిళనాడు బాట పడుతున్నాయి. శ్రీలంకలోని తలైమన్నార్‌ నుంచి రామేశ్వరానికి పడవల ద్వారా రాత్రి వేళల్లో చేరుకుంటున్నారు.

ఆదుకుంటున్న ప్రభుత్వం
ఇలా వచ్చిన వారిని అధికారులు మొదట మండపం శిబిరానికి తరలించి, వివరాలు నిర్ధారించుకున్న తర్వాత రాష్ట్రంలోని ఇతర పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 110 పునరావాస శిబిరాల్లో 20 వేల కుటుంబాలకు చెందిన 65 వేల మంది నివసిస్తుండగా, మరో 35 వేల మంది బయట నివసిస్తున్నారు. శిబిరాల్లోని వారికి ప్రభుత్వం ఉచిత విద్యుత్, నెలవారీ భత్యం, రేషన్ సరుకులు అందిస్తోంది.

శిబిరాల్లోని ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో, వాటి స్థానంలో ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కొత్త గృహాలను నిర్మిస్తోంది. గతేడాది రూ.79.70 కోట్లతో 1,591 ఇళ్లను నిర్మించగా, గత నెలలో పలు జిల్లాల్లో మరో 772 నివాసాలను సీఎం ప్రారంభించారు. 1983 నుంచి ఇప్పటివరకు లక్షలాది మంది శ్రీలంక తమిళులు శరణార్థులుగా తమిళనాడుకు వచ్చారు.
Sri Lanka crisis
Sri Lankan Tamils
Tamil Nadu
economic crisis
refugees
Stalin
Talaimannar
Rameswaram
rehabilitation camps
India

More Telugu News