Kondagattu: కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం

Kondagattu Massive Fire Accident Causes Huge Property Loss
  • కొండగట్టు వద్ద గత రాత్రి భారీ అగ్నిప్రమాదం
  • 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా దగ్ధం
  • సమ్మక్క జాతర కోసం నిల్వ ఉంచిన సరుకు బూడిద
  • కోట్లాది రూపాయల ఆస్తినష్టం జరిగిందని అంచనా
  • విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని ప్రాథమిక నిర్ధారణ
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని వ్యాపారులు భారీ ఎత్తున బొమ్మలను కొనుగోలు చేసి దుకాణాల్లో నిల్వ ఉంచారు. ఒక్కో దుకాణంలో రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల విలువైన సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికి దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. తమ కళ్లెదుటే సర్వస్వం కాలిపోవడంతో వ్యాపారులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మల్యాల, ధర్మపురి సీఐలు రవి, రాంనర్సింహారెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kondagattu
Kondagattu fire accident
Jagtial district
Fire accident
Andhra Pradesh temples
Loss of property
Sammakka Saralamma Jathara
Electrical short circuit
Hanuman temple
Shop fire

More Telugu News