Sayaji Shinde: కుంభమేళా కోసం 1,800 చెట్ల నరికివేతకు సన్నాహాలు.. ‘మహా’ ప్రభుత్వంపై నటుడు సాయాజీ షిండే ఆగ్రహం

Sayaji Shinde Angered by Maharashtra Government Tree Cutting for Kumbh Mela
  • ప్రభుత్వ ప్రణాళికపై పర్యావరణవేత్తలు, స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత
  • ఉద్యమానికి మద్దతు పలికిన ప్రముఖ నటుడు సాయాజీ షిండే
  • తపోవనం అనే ప్రాంతంలోనే చెట్లను తొలగించడంపై విమర్శలు
  • నిరసనల దెబ్బకు చెట్ల సంఖ్య తగ్గింపుపై పునరాలోచనలో నగరపాలక సంస్థ
నాసిక్‌లో 2027లో జరగనున్న కుంభమేళా ఏర్పాట్ల కోసం గోదావరి నది ఒడ్డున సుమారు 1,825 చెట్లను నరికివేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీవ్ర వివాదానికి దారితీసింది. పర్యావరణవేత్తలు, స్థానిక పౌరులు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్థానికంగా మొదలైన ఈ ఉద్యమానికి ప్రముఖ నటుడు, పర్యావరణ ప్రేమికుడు సాయాజీ షిండే మద్దతు పలకడంతో ఇది మరింత విస్తృతమైంది.

2027 కుంభమేళా కోసం మహారాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ. 3,700 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగా సాధువులు, సంతుల బస కోసం తపోవన్ ప్రాంతంలో ‘సాధుగ్రామ్’ నిర్మించనున్నారు. దీని కోసమే పాత, దృఢమైన దేశీయ వృక్షాలను తొలగించాలని నగరపాలక సంస్థ నిర్ణయించింది. ఈ పనులను ఉత్తరప్రదేశ్‌లో జరిగిన కుంభమేళాకు దీటుగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అయితే, ఈ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. శుక్రవారం నటుడు సాయాజీ షిండే స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి, నిరసనకారులకు తన మద్దతు తెలిపారు. ఇప్పటికే దాదాపు ఏడు లక్షల మొక్కలు నాటిన సాయాజీ షిండే, ప్రభుత్వ మొక్కల పెంపకం కార్యక్రమాలను గతంలోనూ ప్రశ్నించారు. చెట్లను నరికేస్తున్న ప్రాంతానికి ‘తపోవనం’ అని పేరు ఉండటం గమనార్హం. ఇలాంటి పవిత్ర ప్రదేశంలోనే చెట్లను కూల్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ వివాదంలో నగరపాలక సంస్థ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాధుగ్రామ్ నిర్మించ తలపెట్టిన ప్రాంతం ‘నో-డెవలప్‌మెంట్ జోన్’ పరిధిలోకి వస్తుందని, అభివృద్ధి ప్రణాళికలో మార్పులు చేయకుండానే పనులు చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా, నరకడానికి గుర్తించిన చెట్లలో కొన్నింటిని గతంలో నగరపాలక సంస్థే నాటినట్లు నిరసనకారులు ఆధారాలతో సహా బయటపెట్టారు.

గంటల వ్యవధిలోనే దాదాపు 3,000 మంది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేయడంతో నగరపాలక సంస్థ ఒకింత వెనక్కి తగ్గింది. నరికే చెట్ల సంఖ్యను తగ్గిస్తామని చెబుతున్నా, కొత్త మొక్కలు నాటుతామన్న హామీని పర్యావరణవేత్తలు విశ్వసించడం లేదు. ఈ చెట్లు నగర ప్రజల ఉమ్మడి ఆస్తి అని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటిని కాపాడుకోవాలని వారు వాదిస్తున్నారు.
Sayaji Shinde
Kumbh Mela
Nashik
Maharashtra Government
Tree Cutting
Godavari River
Environmental Protest
Sadhu Gram
Tapovan
Deforestation

More Telugu News