Mahesh Kumar Goud: జంపింగ్ పాలిటిక్స్‌తో కొంతకాలమే బాగుంటుంది: టీపీసీసీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్య

Mahesh Kumar Goud Comments on Jumping Politics
  • యువజన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్
  • యూత్ నాయకులు గ్రౌండ్‌లో పని చేస్తేనే గుర్తింపు ఉంటుందని సూచన
  • కాంగ్రెస్ పార్టీలో మంచి అవకాశాలు ఉంటాయని వ్యాఖ్య
జంపింగ్ పాలిటిక్స్‌తో (ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి) కొంతకాలమే బాగుంటుందని, కానీ దీర్ఘకాలంలో రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే అది సరైన మార్గం కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్న చాలామంది నేతలు గతంలో ఎన్ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లలో పనిచేసినవారేనని ఆయన గుర్తు చేశారు. ఈ సంస్థలలో పని చేస్తే కాంగ్రెస్ పార్టీలో మంచి భవిష్యత్తు ఉంటుందని ఆయన సూచించారు.

శనివారం గాంధీ భవన్ ప్రాంగణంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, యూత్ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే గుర్తింపు ఉంటుందని, గ్రామాలలో పనిచేస్తే ప్రజల నాడి తెలుస్తుందని అన్నారు. యూత్ కాంగ్రెస్‌లో పనిచేసిన నాయకులు కార్పొరేషన్ ఛైర్మన్‌లుగా, డీసీసీ అధ్యక్షులుగా ఎదిగారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఇలాంటి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.

యూత్ కాంగ్రెస్‌కు గొప్ప భవిష్యత్తు ఉందని ఆయన అన్నారు. రాహుల్ గాంధీ కూడా ఎన్ఎస్‌‌యూఐ, యూత్ కాంగ్రెస్‌లను ఎంతగానో అభిమానిస్తారని ఆయన తెలిపారు. యువతకు మరింత మంచి అవకాశాలు లభించాలని ఆయన ఆకాంక్షించారు. కష్టపడి పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. యూత్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని, రాబోయే రోజుల్లో యువతకు ఉన్నత పదవులు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud
TPCC Chief
Telangana Congress
Jumping Politics
Youth Congress

More Telugu News