Shaheen Saeed: ఒక డాక్టర్, మూడు పెళ్లిళ్లు, ఒక ఉగ్రకుట్ర.. ఢిల్లీ పేలుళ్ల సూత్రధారి షాహీన్ కథ!

Delhi Terror Accused Doctors Shaheen Saeed Love Story And Slow Descent Into Terrorism
  • ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల కేసులో మహిళా డాక్టర్ షాహీన్ సయీద్
  • రెండు విడాకుల తర్వాత మూడో భర్త ద్వారా ఉగ్రవాదంలోకి
  • జైషే మహ్మద్ మహిళా విభాగానికి ఇండియా హెడ్‌గా ఆరోపణలు
  • ఆమె ప్రమేయంపై నమ్మలేకపోతున్నామన్న కుటుంబ సభ్యులు
ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట సమీపంలో ఇటీవ‌ల‌ జరిగిన పేలుళ్ల కేసులో ప్రధాన నిందితురాలిగా 46 ఏళ్ల మహిళా డాక్టర్ షాహీన్ సయీద్ పేరు బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. ఒక వైద్యురాలు, రెండు విఫలమైన వివాహాలు, కొత్తగా దొరికిన ప్రేమ.. చివరికి ఆమెను ఉగ్రవాదం వైపు ఎలా నడిపించాయో దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

దర్యాప్తు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న మరో డాక్టర్ ముజమ్మిల్ షకీల్‌ను షాహీన్ 2023 సెప్టెంబర్‌లో వివాహం చేసుకుంది. ఈ బంధమే ఆమెను ఉగ్రవాద ప్రపంచంలోకి లాగిందని అధికారులు భావిస్తున్నారు. లక్నోలో విద్యావంతుల కుటుంబంలో పుట్టిన షాహీన్, అలహాబాద్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసి ఫార్మకాలజీలో స్పెషలైజేషన్ చేసింది.

మొద‌టి పెళ్లి, విడాకులు.. రెండో వివాహం
2003లో ఆమె నేత్ర వైద్య నిపుణుడు డాక్టర్ జాఫర్ హయత్‌ను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, 2012లో వారు విడిపోయారు. "ఆమె చాలా ప్రేమగల వ్యక్తి. తన పిల్లలన్నా, కుటుంబమన్నా ఎంతో ఇష్టం. అలాంటి వ్యక్తి ఇలాంటి పనుల్లో ఉందని నేను అస్సలు ఊహించలేను" అని ఆమె మాజీ భర్త హయత్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. విడాకుల తర్వాత ఒంటరితనానికి గురైన షాహీన్, తన ఉద్యోగాన్ని కూడా మానేశారు. ఆ తర్వాత ఘజియాబాద్‌కు చెందిన ఓ వ్యాపారిని రెండో వివాహం చేసుకున్నా అది కూడా ఎక్కువ కాలం నిలవలేదు.

జూనియర్ డాక్టర్‌తో ప్రేమాయ‌ణం.. మూడో పెళ్లి
ఈ క్రమంలోనే హర్యానాలోని అల్-ఫలాహ్‌ యూనివర్సిటీలో తన జూనియర్ అయిన కశ్మీరీ డాక్టర్ ముజమ్మిల్ షకీల్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. వీరి పరిచయం పెళ్లికి దారితీసింది. ఈ సమయంలోనే జైషే మహ్మద్ (JeM) మహిళా విభాగం 'జమాత్ ఉల్-మోమినాత్' సభ్యులు ఆమెను సంప్రదించి, ఉగ్రవాద భావజాలం వైపు మళ్లించినట్లు ఏజెన్సీలు గుర్తించాయి. పాకిస్థాన్‌లో మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ నేతృత్వంలోని ఈ విభాగానికి ఇండియాలో షాహీన్‌ను హెడ్‌గా నియమించినట్లు ఆరోపణలున్నాయి.

షాహీన్‌ ప్రమేయంపై కుటుంబ సభ్యుల విస్మ‌యం
ఆమె ప్రమేయంపై కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. "నా కుమార్తె ఇలాంటి చర్యలకు పాల్పడిందని నేను నమ్మలేకపోతున్నాను" అని ఆమె తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ ఆవేదన వ్యక్తం చేసినట్లు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ పేర్కొంది. ఈ కేసులో షాహీన్, ఆమె భర్త ముజమ్మిల్ షకీల్‌తో పాటు మరో డాక్టర్ అదీల్ అహ్మద్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుళ్లలో 15 మంది మృతిచెందిన‌ విషయం తెలిసిందే.
Shaheen Saeed
Delhi blast
Red Fort blast
Jaish e Mohammed
Jammat ul-Mominat
Masood Azhar
terrorism
Dr Muzammil Shakeel
NIA investigation
terror plot

More Telugu News