Julekanti Brahmananda Reddy: పిన్నెల్లి సోదరుల పాపం పండింది: ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

Julekanti Brahmananda Reddy Slams Pinnelli Brothers Crimes Exposed
  • పిన్నెల్లి సోదరులు ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులని ఆరోపణ
  • అధికారాన్ని అడ్డు పెట్టుకుని కన్నూమిన్నూ కానకుండా పెట్రేగిపోయిన అరాచక శక్తి అని ఆగ్రహం
  • మాచర్లను రావణకాష్టంలా మార్చేసి, ప్రజలపై దమనకాండకు తెగబడ్డ దౌర్జన్యకారులని విమర్శ
పిన్నెల్లి సోదరులపై మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బడుగు, బలహీన వర్గాలను హింసించి, హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కళ్లు నెత్తికెక్కేలా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి కుటుంబమని విమర్శించారు.

మాచర్ల నియోజకవర్గాన్ని రావణకాష్ఠంలా మార్చి, తాలిబన్ల వలె ప్రతిపక్షాలు, ప్రజలపై దారుణ దమనకాండకు తెగబడ్డ దౌర్జన్యకారులని తీవ్రంగా విమర్శించారు. మాచర్ల నియోజకవర్గాన్ని ఆటవిక రాజ్యంగా, అరాచకాలకు అడ్డాగా మార్చుకున్నారని వ్యాఖ్యానించారు. సహజ వనరులన్నింటినీ దోచుకున్నారని, మాఫియాను నడిపించారని ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేకుండా నిర్మూలించాలన్నట్టుగా బరితెగించారని మండిపడ్డారు. ఎందరో తెదేపా కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డి అండతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని పేట్రేగిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాచర్లలో గత ఐదేళ్లలో పిన్నెల్లి రాజ్యాంగం, చట్టమే అమలైందని, అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని అన్నారు. పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేశారని, సీఐపైనే హత్యాయత్నం చేసి బరితెగించారని అన్నారు.

ఐదేళ్ల పాటు మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాలను తమ వ్యక్తిగత జాగీరుగా మార్చుకుని, బడుగు బలహీన వర్గాల ప్రజల గొంతు నొక్కి, రక్తం తాగిన ఈ ఇద్దరు నరరూపరాక్షసులు ఈ రోజు చట్టం ముందు అడ్డంగా దొరికిపోయారని అన్నారు. వంద గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలిందన్న సామెత పిన్నెల్లికి అతికినట్లుగా సరిపోతుందని ఆయన అన్నారు. "చేసిన పాపాలు ఊరికే పోతాయా. సుప్రీంకోర్టు నిన్న పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. ఇక వీళ్లకు జైలు శిక్ష తప్పదు. మాచర్ల ప్రజలు ఐదేళ్లుగా ఎదురుచూస్తున్న న్యాయం దగ్గరలోనే ఉంది" అని బ్రహ్మానందరెడ్డి అన్నారు.
Julekanti Brahmananda Reddy
Pinnelli brothers
Macherla
Andhra Pradesh politics
TDP

More Telugu News