Kapil Dev: క్రీజులో పాతుకుపోయే ద్రావిడ్, లక్ష్మణ్ వంటి ఆటగాళ్లు లేకుండా పోయారు: కపిల్ దేవ్

Kapil Dev Misses Dravid and Laxman in Test Cricket
  • ప్రస్తుతం ఎక్కువగా టీ20లు, వన్డే మ్యాచ్‌లు ఆడుతున్నామన్న కపిల్ దేవ్
  • బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బంతులను ఎదుర్కొనే అవకాశాలు తక్కువయ్యాయని వెల్లడి
  • స్పిన్, పేస్ పిచ్‌లపై బ్యాటర్లు చాలా ఓపిక ప్రదర్శించాల్సి ఉంటుందన్న కపిల్ దేవ్
టెస్టుల్లో బ్యాటింగ్ అంటే క్రీజులో పాతుకుపోవడమని, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ వంటి బ్యాటర్లు ఇప్పుడు కరువయ్యారని మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు. ప్రస్తుతం టీ20లు, వన్డే మ్యాచ్‌లు ఎక్కువగా ఆడుతుండటంతో బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై బౌలర్లు సంధించే బంతులను ఎదుర్కొనే అవకాశాలు బ్యాటర్లకు తక్కువగా వస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.

స్పిన్, పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు ఓపికతో ఆడాలని, ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండాలని కపిల్ దేవ్ సూచించాడు. స్పిన్, పేస్‌ను సమర్థంగా ఎదుర్కోవాలంటే ఎంతో నైపుణ్యం అవసరమని ఆయన అన్నాడు. టర్న్, బౌన్స్ ఎక్కువగా ఉండే పిచ్‌లపై బ్యాటింగ్ చేయడం కష్టమని, ఫుట్ వర్క్ అనేది కీలక పాత్ర పోషిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన పేర్కొన్నాడు.

రిషబ్ పంత్ విషయానికి వస్తే అతను సహజసిద్ధమైన మ్యాచ్ విన్నర్ అని కపిల్ దేవ్ అన్నాడు. అతడిని డిఫెన్స్ ఆడమని కోరలేమని, పంత్ సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టును కలవరపాటుకు గురిచేయగల సమర్థుడని ఆయన ప్రశంసించాడు. అలాంటి నైపుణ్యం ఉన్న అతడికి నెమ్మదిగా ఆడి 100 బంతుల్లో ఇరవై పరుగులు చేయమని చెప్పలేమని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.
Kapil Dev
Rahul Dravid
VVS Laxman
Test Cricket
Batting
Rishabh Pant
T20
ODI
Cricket
Indian Cricket

More Telugu News