Anant alias Vikas: మావోయిస్టు పార్టీకి భారీ షాక్.. లొంగిపోయిన కీలక నేత అనంత్

Anant alias Vikas Surrenders to Police After Letter Release
  • కోటి రూపాయల రివార్డు ఉన్న నేత అనంత్ లొంగుబాటు
  • 10 మంది సహచరులతో కలిసి మహారాష్ట్ర పోలీసుల ఎదుట హాజరు
  • సాయుధ పోరాటానికి పరిస్థితులు అనుకూలంగా లేవన్న అనంత్
మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తన సహచరులతో కలిసి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఐదు రాష్ట్రాల్లో రూ. కోటి రివార్డు ఉన్న అనంత్, మరో 10 మంది మావోయిస్టులతో కలిసి మహారాష్ట్రలోని గోండియా జిల్లా దారేక్ష పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు అధికారులు వెల్లడించారు. జనవరి 1న లొంగిపోతామని లేఖ విడుదల చేసిన 24 గంటలు గడవకముందే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

లొంగిపోయే ముందు అనంత్ ఒక లేఖతో పాటు వరుస ఆడియో సందేశాలను విడుదల చేశారు. మారుతున్న పరిస్థితుల దృష్ట్యా పార్టీ సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, ప్రధాన స్రవంతిలోకి వచ్చి ప్రజల మధ్య పనిచేయాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. "ఇది లొంగిపోవడం కాదు, విప్లవానికి ద్రోహం చేయడం అంతకన్నా కాదు. ప్రజల సమస్యలను మరో రూపంలో ముందుకు తీసుకెళ్తాం" అని ఆయన స్పష్టం చేశారు.

"సాయుధ పోరాటాన్ని కొనసాగించడానికి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. మనం ఇప్పటికే ఎందరో సహచరులను కోల్పోయాం. ఇంకా ఎవరినీ కోల్పోవాలని అనుకోవడం లేదు. అందుకే మీరు ఎక్కడున్నా సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలి. ముందుగా మనమందరం బతికి ఉండటం ముఖ్యం. ప్రతి ఒక్కరూ ఒంటరిగా లొంగిపోవద్దు, మనమంతా కలిసి లొంగిపోదాం" అని తన ఆడియో సందేశంలో సహచరులకు పిలుపునిచ్చారు. ఈ ఘటన ఎంఎంసీ జోన్‌లో మావోయిస్టు ఉద్యమాన్ని బలహీనపరిచినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
Anant alias Vikas
Maoist Party
Maharashtra
Chhattisgarh
Madhya Pradesh
MMC Special Zonal Committee
Surrender
Naxalite
Gondia district
Darexa Police Station

More Telugu News