Ayush Mhatre: రోహిత్ శర్మ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. సత్తా చాటిన ముంబై కుర్రాడు!

Ayush Mhatre Breaks Rohit Sharmas 19 Year Old Record
  • రోహిత్ శర్మ 19 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఆయుశ్‌ మాత్రే
  • టీ20, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏలలో సెంచరీ చేసిన పిన్న వయస్కుడిగా రికార్డ్‌
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో విదర్భపై 49 బంతుల్లోనే శతకం బాదిన వైనం
  • అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు కెప్టెన్‌గా నియామకం
ముంబై యువ బ్యాటర్ ఆయుశ్‌ మాత్రే (18) చరిత్ర సృష్టించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట 19 ఏళ్లుగా ఉన్న అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా శుక్రవారం విదర్భతో జరిగిన మ్యాచ్‌లో ఆయుశ్‌ విధ్వంసక సెంచరీతో చెలరేగాడు. దీంతో టీ20, ఫస్ట్-క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్‌లలో శతకాలు సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు.

లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆయుశ్‌ కేవలం 49 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్లతో తన తొలి టీ20 సెంచరీని నమోదు చేశాడు. 18 సంవత్సరాల 135 రోజుల వయసులో అతను ఈ ఘనత సాధించి, 19 ఏళ్ల 339 రోజుల వయసులో ఈ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో ఉన్ముక్త్ చంద్, క్వింటన్ డికాక్ వంటి ఆటగాళ్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

కాగా, ఇదే రోజు ఆయుశ్‌కు మరో శుభవార్త అందింది. త్వరలో జరగనున్న అండర్-19 ఆసియా కప్‌కు భారత జట్టు కెప్టెన్‌గా అతడిని ఎంపిక చేశారు. డిసెంబర్ 12 నుంచి 21 వరకు దుబాయ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ టోర్నమెంట్ జరగనుంది. ఈ టోర్నీలో భాగంగా డిసెంబర్ 14న భారత్, పాకిస్థాన్‌తో తలపడనుంది.

భారత అండర్-19 జట్టు:
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా (వైస్ కెప్టెన్), వేదాంత్ త్రివేది, అభిగ్యాన్ కుండు (వికెట్ కీపర్), హర్వంశ్ సింగ్ (వికెట్ కీపర్), యువరాజ్ గోహిల్, కనిష్క్ చౌహాన్, ఖిలన్ ఎ. పటేల్, నమన్ పుష్పక్, డి. దీపేష్, హెనిల్ పటేల్, కిషన్ కుమార్ సింగ్, ఉధవ్ మోహన్, ఆరోన్ జార్జ్.


Ayush Mhatre
Rohit Sharma
Syed Mushtaq Ali Trophy
Mumbai
Under 19 Asia Cup
Vidarbha
Cricket Record
Youngest Century
Indian Cricket
U19 Asia Cup

More Telugu News