Nirmala Sitharaman: ఏపీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన వెంటనే ఆమోదం తెలుపుతారు: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman Modi Approves AP Projects Immediately
  • అమరావతి పునఃప్రారంభంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హర్షం
  • రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన
  • రైతుల త్యాగాన్ని మరువొద్దని, వారికి బ్యాంకులు అండగా నిలవాలని పిలుపు
  • ఏపీకి ప్రధాని మోదీ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం
  • రాష్ట్రంలో ఏఐ, క్వాంటం వ్యాలీ, ఆస్ట్రో ఫిజిక్స్ ప్రాజెక్టులకు కేంద్రం మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభం కావడం సంతోషకరమని, ఇది ఒక యజ్ఞం లాంటిదని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దేశంలో ఒక కొత్త రాజధాని నగరాన్ని నిర్మించడం సామాన్య విషయం కాదని, ఈ బృహత్కార్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని ఆమె స్పష్టం చేశారు. శుక్రవారం అమరావతిలో 15 ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె ప్రసంగించారు.

భవిష్యత్ రాజధానికి ఆర్ధిక భరోసా కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వ రంగ ఆర్ధిక సంస్థలు (పీఎస్‌యూ) తమ ప్రధాన కార్యాలయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఒకేచోట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 15 బ్యాంకులు, బీమా సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులను ఎన్నటికీ మర్చిపోకూడదని, వారి ప్రయోజనాలను కాపాడటం బ్యాంకుల బాధ్యత అని గుర్తుచేశారు. బ్యాంకులు కేవలం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వడానికే పరిమితం కాకుండా, రైతుల ఉత్పత్తులకు మార్కెటింగ్, ప్యాకింగ్, కోల్డ్ చెయిన్ వంటి సౌకర్యాలు కల్పించే పరిశ్రమలను ప్రోత్సహించాలని సూచించారు. ముఖ్యంగా రాయలసీమలోని 9 జిల్లాల నుంచి ఉద్యాన ఉత్పత్తులను ఇతర రాష్ట్రాల మార్కెట్లకు తరలించడానికి బ్యాంకులు సహకరించాలని పిలుపునిచ్చారు.

దేశంలో గత పదేళ్లలో 25 కోట్ల మందిని దారిద్ర్యరేఖ నుంచి బయటకు తీసుకువచ్చామని, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు కూడా పెరుగుతున్నాయని నిర్మల వివరించారు. ఈ మార్పులకు అనుగుణంగా బ్యాంకులు భవిష్యత్ ఆలోచనలతో, సమీకృత ఐడియాలతో పనిచేయాలని సూచించారు. గతంలో 'మహిళా సఖి' పేరుతో మహిళలను బీమా ఏజెంట్లుగా మార్చే కార్యక్రమం అద్భుత ఫలితాలు ఇచ్చిందని గుర్తుచేశారు.

విభజన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌కు అన్ని విధాలా అండగా నిలవాలని ప్రధాని మోదీ ఎప్పుడూ చెబుతుంటారని, ఏపీ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఆయన తక్షణమే ఆమోదం తెలుపుతారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని క్వాంటం వ్యాలీ, ఏఐ ప్రాజెక్టుల కోసం జిల్లాల్లో ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేవలం ఐటీ మాత్రమే కాకుండా, ఆస్ట్రో ఫిజిక్స్ వంటి రంగాల్లోనూ ఏపీని ముందుకు తీసుకెళ్తున్నామని, ఇందులో భాగంగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రో ఫిజిక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం సంతోషకరమన్నారు.

ఆచార్య నాగార్జునుడు వంటి గొప్ప శాస్త్రవేత్తలు నడయాడిన ఈ గడ్డపై, అమరావతిలో ఒక కాస్మోస్ ప్లానెటోరియం నిర్మిస్తుండడం హర్షణీయమని అన్నారు. రానున్న ఏడాదిన్నర కాలంలో ఆంధ్రప్రదేశ్ ఒక ఫ్యూచరిస్టిక్ కేపిటల్ నగరంగా రూపుదిద్దుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల రేర్ ఎర్త్ మినరల్స్‌పై కీలక నిర్ణయం తీసుకుందని, ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కూడా ఏపీ కృషి చేయాలని నిర్మలా సీతారామన్ కోరారు.
Nirmala Sitharaman
Amaravati
Andhra Pradesh
AP Capital
Narendra Modi
Banks
Financial Institutions
Rural Development
Economic Growth
Infrastructure Development

More Telugu News