Prithvi Shaw: ఐపీఎల్ వేలానికి ముందు పృథ్వీ షా మెరుపులు.. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ

Prithvi Shaw Scores Half Century in 23 Balls Against Hyderabad
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పృథ్వీ షా మెరుపు ఇన్నింగ్స్
  • హైదరాబాద్‌పై 36 బంతుల్లో 66 పరుగులు చేసిన మహారాష్ట్ర కెప్టెన్
  • డిసెంబర్ 15న జరగనున్న ఐపీఎల్ మినీ వేలంపై దృష్టి
  • గత ఏడాది ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని పృథ్వీ షా
గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి, జట్టులో చోటు కోసం ఇబ్బంది పడుతున్న యువ ఓపెనర్ పృథ్వీ షా మళ్లీ తన పాత దూకుడును ప్రదర్శించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇవాళ‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మహారాష్ట్ర కెప్టెన్‌గా బరిలోకి దిగి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 36 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 66 పరుగులు చేసి, రాబోయే ఐపీఎల్ మినీ వేలానికి ముందు ఫ్రాంచైజీలకు బలమైన సంకేతాలు పంపాడు.

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ క్యాంపస్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ నిర్దేశించిన 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మహారాష్ట్రకు పృథ్వీ షా అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 23 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి తన ఉద్దేశాన్ని చాటాడు. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణితో కలిసి తొలి వికెట్‌కు 73 బంతుల్లోనే 117 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. రుతురాజ్ గైక్వాడ్ జాతీయ జట్టుకు ఎంపిక కావ‌డంతో మహారాష్ట్రకు షా కెప్టెన్సీ వహిస్తున్నాడు.

గత ఏడాది పేలవ ఫామ్, క్రమశిక్షణ సమస్యల కారణంగా పృథ్వీ షా ఐపీఎల్ కాంట్రాక్ట్ కోల్పోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేయడంతో వేలంలో ఏ జట్టూ అతడిని కొనుగోలు చేయలేదు. ముంబై జట్టులో అవకాశాలు లేకపోవడంతో ఈ సీజన్‌లో మహారాష్ట్రకు మారాడు. ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో కేవలం 5 పరుగులకే ఔటైనప్పటికీ, కీలకమైన రెండో మ్యాచ్‌లో ఒత్తిడిని అధిగమించి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.

డిసెంబర్ 15న అబుదాబిలో ఐపీఎల్ మినీ వేలం జరగనున్న నేపథ్యంలో పృథ్వీ షా ప్రదర్శన అతడికి మళ్లీ అవకాశాలు తెచ్చిపెట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఫామ్‌ను కొనసాగిస్తే, అతడిని దక్కించుకోవడానికి ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది.


Prithvi Shaw
Syed Mushtaq Ali Trophy
Maharashtra
Hyderabad
IPL Auction
Indian Cricket
T20 Cricket
Arshin Kulkarni
Ruturaj Gaikwad

More Telugu News