DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్‌లో కుర్చీ ఫైట్.. సిద్ధూ, డీకే మధ్య మాటల యుద్ధం

DK Shivakumar Siddaramaiah Fight Erupts in Karnataka Congress
  • సోషల్ మీడియా వేదికగా సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోరు
  • అధికార మార్పిడి ఒప్పందాన్ని గుర్తుచేస్తూ డీకే శివకుమార్ పోస్ట్
  • ప్రభుత్వ పథకాలను ప్రస్తావిస్తూ కౌంటర్ ఇచ్చిన సిద్ధరామయ్య
కర్ణాటక కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి వివాదం తారస్థాయికి చేరింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు పరోక్ష విమర్శలు చేసుకుంటూ తమ విభేదాలను బహిర్గతం చేశారు. దీంతో కాంగ్రెస్ అధిష్ఠానం రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించింది.

గురువారం డీకే శివకుమార్ ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ ఈ వివాదానికి ఆజ్యం పోసింది. ‘మాటకు ఉన్న శక్తే ప్రపంచ శక్తి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద బలం’ అని పేర్కొన్నారు. 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు కుదిరినట్లుగా చెబుతున్న రెండున్నరేళ్ల అధికార మార్పిడి ఒప్పందాన్ని గుర్తుచేయడానికే ఈ పోస్ట్ పెట్టారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

డీకే పోస్టుకు సిద్ధరామయ్య కూడా అదే తరహాలో ఘాటుగా బదులిచ్చారు. ‘ప్రజలకు మంచి చేయనప్పుడు మాటకు శక్తి ఉండదు’ అని ఆయన కౌంటర్ ఇచ్చారు. తమ ‘శక్తి’ పథకం ద్వారా మహిళలకు 600 కోట్లకు పైగా ఉచిత ప్రయాణాలు అందించామని గుర్తుచేశారు. ప్రజలు తమకు ఐదేళ్ల పూర్తికాలానికి అధికారం ఇచ్చారని, తమ మాట నినాదం కాదని, అదే తమకు ప్రపంచమని స్పష్టం చేశారు.

ఈ మాటల యుద్ధంపై కర్ణాటక బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇది శక్తి గురించి కాదని, కుర్చీ గురించేనని ఎద్దేవా చేసింది. అంతేకాదు డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేయాలంటూ సిద్ధరామయ్యను ఉద్దేశించి పోస్ట్ చేసింది.

నవంబర్ 20తో సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తిచేయడంతో ఈ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ సంక్షోభంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సమస్య పరిష్కారానికి త్వరలోనే ఇద్దరు నేతలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో చర్చించాకే తుది నిర్ణయం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 

మరోవైపు, సిద్ధరామయ్యను సీఎం పదవి నుంచి తొలగిస్తే ఊరుకోబోమని వెనుకబడిన తరగతుల సమాఖ్య, శివకుమార్‌కు అన్యాయం జరిగితే సహించబోమని ఒక్కలిగ సంఘం హెచ్చరించడంతో ఈ వివాదం మరింత సంక్లిష్టంగా మారింది.
DK Shivakumar
Karnataka Congress
Siddaramaiah
Karnataka Politics
Chief Minister
Political Controversy
Congress Party
Power Sharing
Karnataka BJP
Mallikarjun Kharge

More Telugu News