Amaravati: అమరావతికి కొత్త కళ.. 15 బ్యాంకులకు నేడు శంకుస్థాపన

Amaravati New Look Nirmala Sitharaman Inaugurates 15 Bank Projects
  • అమరావతిలో 15 బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యాలయాలకు శంకుస్థాపన
  • రాజధానికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు, 6,500కు పైగా ఉద్యోగాలు
  • కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు హాజరు
  • ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు
రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న 15 జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల రాష్ట్ర కార్యాలయాల భవన నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 11.22 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు.

ఈ సంస్థల ఏర్పాటు ద్వారా అమరావతికి రూ.1,328 కోట్ల పెట్టుబడులు రానుండగా, సుమారు 6,514 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఏపీసీఆర్డీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఉద్దండరాయునిపాలెం, వెలగపూడి, రాయపూడి, లింగాయపాలెం గ్రామాల్లో ఈ కార్యాలయాలను నిర్మించనున్నారు. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు ప్రక్రియను సీఆర్డీఏ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కార్యాలయాలు, ఉద్యోగుల నివాసాల కోసం మొత్తం 27.85 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఎస్బీఐ, కెనరా, నాబార్డ్, యూనియన్ బ్యాంకు వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ తమ కార్యాలయాలను నిర్మించుకోనున్నాయి.

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన విందుకు మంత్రి లోకేశ్‌తో పాటు నారా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా హాజరయ్యారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం, పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులపై నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.
Amaravati
Nirmala Sitharaman
Andhra Pradesh
APCRDA
Chandrababu Naidu
Pawan Kalyan
Financial District Amaravati
Bank Offices
Investments Andhra Pradesh
Polavaram Project Funds

More Telugu News