Revanth Reddy: తెలంగాణ రైజింగ్-2047 పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Revanth Reddy Reviews Telangana Rising 2047 Policy
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధనే లక్ష్యమన్న సీఎం 
  • రోడ్ మ్యాప్ సిద్దం చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి
  • యువతకు ఉపాధి, సమీకృత అభివృద్ధే ప్రధాన అజెండా అని వెల్లడి
  • రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించాలని సూచన
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి స్పష్టమైన దిశానిర్దేశం చేసేలా "తెలంగాణ రైజింగ్-2047" పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పటిష్టమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని సూచించారు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని మూడు రీజియన్లుగా విభజించాలని ఒక నూతన ఫార్ములాను ప్రతిపాదించారు.
 
ఈ డాక్యుమెంట్‌పై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (CURE), పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీ (PURE), రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (RARE)గా విభజించి, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను స్పష్టంగా పొందుపరచాలన్నారు. రానున్న 22 ఏళ్లలో యువతకు మెరుగైన ఉపాధి, అందరికీ సమాన అవకాశాలు, సమీకృత అభివృద్ధే లక్ష్యంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలని చెప్పారు.
 
ఫార్మా, ఏరోస్పేస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టూరిజం, MSME వంటి రంగాలు ఆర్థిక వృద్ధికి కీలకం కానున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. పారదర్శక పాలన, సులభతర అనుమతుల (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) వంటి అంశాలు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని, ఈ బలాలను ఆధారంగా చేసుకుని విజన్ డాక్యుమెంట్ రూపొందించాలని సూచించారు.
 
ఈ సందర్భంగా అధికారులు తమ ప్రణాళికలను వివరించారు. మూసీ పునరుజ్జీవం, 'విలేజ్ 2.0' లక్ష్యంతో గ్రామాల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్డు, హైస్పీడ్ కారిడార్లు, వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు వంటి అంశాలను డాక్యుమెంట్‌లో చేర్చనున్నట్లు తెలిపారు.
Revanth Reddy
Telangana Rising 2047
Telangana economy
1 Trillion Dollar Economy
Economic Development
Telangana development
Telangana growth
Regional Ring Road
Village 2.0

More Telugu News