Chandrababu Naidu: హైదరాబాద్‌లా అమరావతి ఎదగాలంటే విస్తరణ తప్పనిసరి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Says Amaravati Expansion Needed to Rival Hyderabad
  • హైదరాబాద్‌లా ఎదగాలంటే 29 గ్రామాల పరిధి సరిపోదన్న చంద్రబాబు
  • అమరావతి విస్తరణకు రైతుల మద్దతు కోరిన సీఎం
  • రైతుల సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు
  • క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపు పొడిగింపునకు కేంద్రానికి విజ్ఞప్తి
  • అసత్య ప్రచారాలను అడ్డుకుంటామని రైతులకు భరోసా
రాజధాని అమరావతిని హైదరాబాద్ స్థాయి మహానగరంగా తీర్చిదిద్దాలంటే కేవలం 29 గ్రామాల పరిధి సరిపోదని, నగరాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పరిధిని పెంచకపోతే అమరావతి ఒక సాధారణ మున్సిపాలిటీగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని, ఈ బృహత్ ప్రణాళికకు రైతుల పూర్తి సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల పట్ల తనకు ఎనలేని గౌరవం, కృతజ్ఞత ఉన్నాయని ఆయన పునరుద్ఘాటించారు.

గురువారం సచివాలయంలోని ఐదో బ్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ముఖ్యమంత్రి సుమారు 80 మంది రాజధాని రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటన నేపథ్యంలో, క్యాపిటల్ గెయిన్స్ పన్ను మినహాయింపును మరో రెండేళ్లపాటు పొడిగించేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని రైతులు సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు, రైతుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఇప్పటికే ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశామని వెల్లడించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు కొల్లు రవీంద్ర (నారాయణ), ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికే మూడుసార్లు సమావేశమై కీలక అంశాలపై చర్చించినట్లు సీఎం వివరించారు.

ఈ సమావేశంలో భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, అసైన్డ్ భూముల సమస్యలు, ఇతర పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. పరిష్కరించగల ప్రతీ సమస్యకు త్వరలోనే ముగింపు పలుకుతామని, ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే సోషల్ మీడియా ద్వారా అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని రైతులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా, అలాంటి అసత్య ప్రచారాలను కట్టడి చేసి, రాజధాని నిర్మాణానికి అడ్డంకులను తొలగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రైతుల సంక్షేమం, రాజధాని ప్రాంత అభివృద్ధే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని చంద్రబాబు అన్నారు. రైతుల సహకారంతోనే అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశం అనంతరం, రైతులు ప్రభుత్వ స్పందనపై హర్షం వ్యక్తం చేశారు. కాగా, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అమరావతి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నివాసంలో విందుకు హాజరయ్యారు.
Chandrababu Naidu
Amaravati
Andhra Pradesh
Capital City
Land Pooling
Farmers
Nirmala Sitharaman
Pattasani Chandrasekhar
Kollu Ravindra
Tenali Sravan Kumar

More Telugu News