Mumbai Crime: ముంబైలో దారుణం.. కుమార్తెను వ్యభిచార కూపంలోకి దింపేందుకు కన్నతల్లి యత్నం

Mumbai Crime Mother Attempts to Force Daughter into Prostitution
  • ఘట్‌కోపర్ ప్రాంతంలో ఘటన
  • స్నేహితురాలి భరోసాతో స్కూల్ టీచర్‌తో తన బాధను పంచుకున్న బాధిత బాలిక
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన స్కూల్ యాజమాన్యం
ముంబైలోని ఘట్‌కోపర్ ప్రాంతంలో ఓ దిగ్భ్రాంతికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న కుమార్తెను కన్నతల్లే వ్యభిచార కూపంలోకి దించేందుకు ప్రయత్నించింది. పక్కింటి వ్యక్తితో కలిసి డబ్బుల కోసం తనను వ్యభిచారం చేయాలని బలవంతం చేస్తున్నారంటూ బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఏప్రిల్ నుంచి ఈ రోజు వరకు తన తల్లి, పక్కింటి వ్యక్తి కలిసి వ్యభిచారం చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, డబ్బులు సంపాదించేందుకు ఇదే సరైన మార్గమని వారు చెప్పేవారని బాధిత బాలిక పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తల్లి నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో తన బాధను స్నేహితురాలితో పంచుకుంది. ఆమె ఇచ్చిన ధైర్యం, ప్రోత్సాహంతో స్కూల్ టీచర్‌కు చెప్పింది.  

అంతేకాదు, ఈ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు బాలిక ఒకసారి ఇంటి నుంచి పారిపోయి మూడు రోజులపాటు స్నేహితురాలి ఇంట్లో కూడా ఉంది. తిరిగి ఇంటికి వచ్చాక నిందితులు తనను కొట్టి, బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి నెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. 

బాలిక చెప్పింది విన్న ఉపాధ్యాయురాలు వెంటనే ఈ విషయాన్ని పాఠశాల యాజమాన్యానికి తెలియజేసింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన యాజమాన్యం వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  
Mumbai Crime
Mumbai
Child Prostitution
Gharkopar
Crime News
Prostitution Racket
Minor Girl
Police Investigation
Human Trafficking

More Telugu News