Nara Lokesh: సొంత ఖర్చులతోనే లోకేశ్ విమాన ప్రయాణాలు: ఆరోపణలను ఖండించిన టీడీపీ

Nara Lokesh travels are self funded TDP refutes allegations
  • ప్రభుత్వ సొమ్ము వాడుతున్నారన్న ఆరోపణలు అవాస్తవమన్న టీడీపీ
  • జగన్ పత్రికపై తీవ్రంగా స్పందించిన టీడీపీ నేతలు
  • అధికారిక పర్యటనలకు కూడా జేబు నుంచే ఖర్చు చేస్తున్నారని వెల్లడి
ఏపీ మంత్రి నారా లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై టీడీపీ నేతలు స్పష్టతనిచ్చారు. ఆయన తన పర్యటనలన్నింటికీ సొంతంగానే ఖర్చు చేస్తున్నారని, ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు. కావాలనే ఓ వర్గం మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు.

జగన్‌కు చెందిన పత్రికలో లోకేశ్ 77 సార్లు హైదరాబాద్‌కు విమానంలో వెళ్లారని, ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని కథనం ప్రచురించడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. పెట్టుబడుల సాధన కోసం వెళ్లే అధికారిక పర్యటనలకు సైతం లోకేశ్ తన సొంత డబ్బునే వాడుతున్నారని గుర్తు చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యత కూడా ఆయనపై ఉందని, అందుకే తరచూ హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోందని వివరించారు.

గతంలో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్‌కు 15 కిలోమీటర్ల దూరంలోని కార్యక్రమానికి ప్రభుత్వ ఖర్చుతో ప్రత్యేక విమానంలో వెళ్లారని, కానీ లోకేశ్ అలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయలేదని విమర్శించారు. గతంలో ‘చినబాబు చిరుతిండి’ అంటూ తప్పుడు వార్తలు రాసినప్పుడే లోకేశ్ పరువు నష్టం దావా వేశారని, అయినా ఆ పత్రిక బుద్ధి మారలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
Nara Lokesh
TDP
Telugu Desam Party
Andhra Pradesh Politics
Jagan Mohan Reddy
Flight Travel
Hyderabad
Political Allegations
Corruption
AP Politics

More Telugu News