Cheteshwar Pujara: టీమిండియా క్రికెటర్ పుజారా బావమరిది ఆత్మహత్య!

Cheteshwar Pujara Family Tragedy Brother in Law Commits Suicide
  • పుజారా బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి ఆత్మహత్య
  • రాజ్‌కోట్‌లోని నివాసంలో బలవన్మరణానికి పాల్పడిన జీత్
  • ఏడాది క్రితం నమోదైన రేప్ కేసు ఒత్తిడితోనే ఆత్మహత్యగా అనుమానం
టీమిండియా మాజీ టెస్ట్ క్రికెటర్ చెతేశ్వర్ పుజారా కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి రాజ్‌కోట్‌లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం బుధవారం (నవంబర్ 26) ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న మాల్వియానగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జీత్‌ను సమీపంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత మృతికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.

కాగా, సరిగ్గా ఏడాది క్రితం 2024లో జీత్ మాజీ ప్రియురాలు ఆయనపై అత్యాచారం కేసు పెట్టారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని, నిశ్చితార్థం తర్వాత కూడా వేధింపులు కొనసాగించి, ఆపై సంబంధాన్ని అకస్మాత్తుగా రద్దు చేసుకున్నాడని ఆమె తన ఫిర్యాదులో ఆరోపించింది. కేసు నమోదైన తేదీనే జీత్ ఆత్మహత్య చేసుకోవడంతో, ఆ కేసుకు సంబంధించిన తీవ్రమైన ఒత్తిడి కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

పుజారా 2013లో జీత్ సోదరి పూజా పబారిని వివాహం చేసుకున్నారు. భారత టెస్ట్ జట్టుకు నమ్మకమైన బ్యాటర్‌గా పేరుగాంచిన పుజారా, ఈ ఏడాది ప్రారంభంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇటీవల ఆయన భార్య పూజా 'ది డైరీ ఆఫ్ ఎ క్రికెటర్స్ వైఫ్' అనే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. 
Cheteshwar Pujara
Pujara
Jeet Pabari
suicide
Rajkot
cricket
sexual assault case
Pooja Pabari
domestic issues
India cricketer

More Telugu News