Raghurama Krishnam Raju: రఘురామ టార్చర్ కేసు: ఐపీఎస్ సునీల్ కుమార్‌కు నోటీసులు

Raghurama Torture Case Notices to IPS Sunil Kumar
  • డిసెంబర్ 4న గుంటూరులో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు
  •  కూటమి ప్రభుత్వం వచ్చాక రఘురామ ఫిర్యాదుతో కేసు నమోదు
  •  ఇప్పటికే ఈ కేసులో అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ అరెస్ట్
  •  ప్రస్తుతం సస్పెన్షన్‌లో కొనసాగుతున్న పీవీ సునీల్ కుమార్
వైసీపీ ప్రభుత్వ హయాంలో సంచలనం సృష్టించిన రఘురామకృష్ణరాజు కస్టడీ హింస కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్‌కు విచారణాధికారి నోటీసులు జారీ చేశారు. డిసెంబర్ 4న గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆ నోటీసులో ఆదేశించారు. 
 
2021 మే 14న రఘురామకృష్ణరాజును హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఐడీ పోలీసులు అరెస్టు చేసి గుంటూరుకు తరలించారు. ఆ రోజు రాత్రి కస్టడీలో తనపై తీవ్రంగా దాడి చేసి, హత్యాయత్నం చేశారని రఘురామ ఆరోపించారు. అయితే, అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయన ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత, కూటమి అధికారంలోకి రావడంతో రఘురామ ఈ ఏడాది జులై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఆయన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నాటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను ఏ 1గా, నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును ఏ 2గా, నాటి సీఎం వైఎస్ జగన్ ను ఏ 3గా, అప్పటి సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్ ను ఏ 4గా, అప్పటి గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిని ఏ 5గా చేరుస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఈ కేసులో ఇప్పటికే విజయపాల్‌ను విచారించి అరెస్టు చేశారు. అలానే రఘురామపై కస్టడీలో దాడి చేసిన తులసిబాబును అరెస్టు చేశారు. ప్రస్తుత విజయనగరం ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది.
Raghurama Krishnam Raju
PV Sunil Kumar
CID
Andhra Pradesh
Guntur
Custodial Torture Case
YS Jagan
Vijayapal

More Telugu News