Shubman Gill: 25 ఏళ్ల తర్వాత భార‌త్‌కు ఘోర పరాభవం.. ఓటమిపై కెప్టెన్ గిల్ ఏమ‌న్నాడంటే..!

Shubman Gill on Indias Defeat After 25 Years Against South Africa
  • సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టెస్ట్ సిరీస్ ఓటమి
  • 25 ఏళ్ల తర్వాత ఇండియాలో సఫారీలకు చారిత్రక సిరీస్ విజయం
  • ఓటమిపై స్పందిస్తూ 'ఎక్స్'లో పోస్ట్ పెట్టిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్
  • ఒకరికొకరం అండగా నిలుస్తామని, బలంగా పుంజుకుంటామని వెల్లడి
దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు టెస్టుల సిరీస్‌ను 0-2 తేడాతో కోల్పోయి క్లీన్‌స్వీప్‌కు గురైంది. గువాహటిలో జరిగిన రెండో టెస్టులో ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. 25 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో కూడా భారత్ 30 పరుగుల తేడాతో ఓడిపోయింది.

ఈ సిరీస్ ఓటమి తర్వాత జట్టు ప్రదర్శన, నాయకత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు అభిమానులు కోచ్ గౌతమ్ గంభీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో ఐక్యతను, పట్టుదలను చాటుతూ స్పందించాడు. 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశాడు.

"ప్రశాంతమైన సముద్రాలు నావను ఎలా నడపాలో నేర్పవు. తుపానులే గట్టి చేతులను తయారు చేస్తాయి. మేం ఒకరినొకరు నమ్ముకుంటాం, ఒకరి కోసం ఒకరం పోరాడతాం. మరింత బలంగా పుంజుకుని ముందుకు సాగుతాం" అని గిల్ త‌న సందేశంలో పేర్కొన్నాడు.

కాగా, మెడ నొప్పి కారణంగా గిల్ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. కోల్‌కతా టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మెడకు గాయం కావడంతో ఆయన రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చేరడంతో మ్యాచ్‌కు పూర్తిగా దూరమయ్యాడు. గువాహటి వెళ్లినప్పటికీ, మ్యాచ్ ప్రారంభానికి ముందు అతడిని జట్టు నుంచి రిలీజ్ చేశారు.


Shubman Gill
India vs South Africa
India Test Series Loss
South Africa Test series win
Cricket
Gautam Gambhir
Cricket Team India
Test Cricket
Cricket Series
Guwahati Test

More Telugu News