Batthina Shashikanth: హైదరాబాద్‌లో నకిలీ ఐఏఎస్ అరెస్ట్... గన్‌మన్లతో, సైరన్‌తో భారీ మోసాలు!

Batthina Shashikanth Arrested in Hyderabad for Fake IAS Impersonation
  • ఐఏఎస్, ఐపీఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
  • తమిళనాడు నుంచి ఇద్దరు గన్‌మన్లను నియమించుకున్న నిందితుడు
  • వాహనానికి సైరన్, వాకీటాకీలతో జనాలను నమ్మించిన వైనం
  • జిమ్ యజమాని నుంచి రూ.10.50 లక్షలు వసూలు చేసి పరారీ
  • నిందితుడి నుంచి నకిలీ ఐడీ కార్డులు, వాకీటాకీలు స్వాధీనం
తాను ఉన్నతస్థాయి ఐఏఎస్, ఐపీఎస్ అధికారినంటూ నమ్మించి, ఇద్దరు గన్‌మెన్లను కూడా నియమించుకుని మోసాలకు పాల్పడుతున్న ఓ కేటుగాడిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనానికి సైరన్ బిగించుకుని, వాకీటాకీలతో హల్‌చల్ చేస్తూ రెండేళ్లుగా అమాయకులను మోసం చేస్తున్న బత్తిన శశికాంత్ (39) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

బుధవారం డీసీపీ సిహెచ్. శ్రీనివాస్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. శశికాంత్ గత రెండేళ్లుగా తాను మైనింగ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌నని, మరికొన్నిసార్లు ఐపీఎస్/ఎన్ఐఏ అధికారినని నమ్మించి పలువురి వద్ద పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశాడు. తనను నిజమైన అధికారిగా నమ్మించేందుకు తమిళనాడు నుంచి ఇద్దరు వ్యక్తులను ఆయుధాలతో సహా వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా నియమించుకున్నాడు.

ఓ జిమ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన అలీ హసన్ అనే వ్యక్తికి పారిశ్రామిక భూమి ఇప్పిస్తానని, ఇతర అధికారిక పనుల్లో సాయం చేస్తానని నమ్మించి రూ.10.50 లక్షలు వసూలు చేశాడు. డబ్బు తీసుకున్న తర్వాత పరారీ కావడంతో బాధితుడు ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు షేక్‌పేటలోని నిందితుడి నివాసంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి నకిలీ ఐఏఎస్/ఐపీఎస్/ఎన్ఐఏ గుర్తింపు కార్డులు, రెండు మొబైల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, టీఎస్‌ఐఐసీకి చెందిన నకిలీ భూ కేటాయింపు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శశికాంత్‌కు గన్‌మెన్లుగా పనిచేసిన ప్రవీణ్, విమల్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని ఆయన సూచించారు.
Batthina Shashikanth
Hyderabad
Fake IAS officer
Fraud
Impersonation
Police arrest
Gunmen
TSIIIC
Ali Hassan
Filmnagar police

More Telugu News