Kalvakuntla Kavitha: రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పందించిన కవిత

Kalvakuntla Kavitha Responds on Political Party Formation
  • పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కవిత
  • పార్టీ ఎప్పుడైనా పెట్టవచ్చు... ప్రజల సమస్యలు తీర్చేలా ఉండాలన్న కవిత
  • బీఆర్ఎస్ గురించి తాను మాట్లాడనని, బద్నాం చేస్తున్నారన్న కవిత
రాజకీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. పార్టీ ఏర్పాటుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అయితే మహిళల నుంచి పార్టీ పెట్టాలనే డిమాండ్ ఎక్కువగా వస్తోందని ఆమె అన్నారు. పార్టీ అనేది ఎప్పుడైనా పెట్టవచ్చు కానీ, ప్రజల సమస్యలు తీర్చేలా ఏ పార్టీ అయినా ఉండాలని వ్యాఖ్యానించారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని విమర్శించారు.

బీసీ రిజర్వేషన్లకు సంబంధించి నివేదిక ఇంత తప్పులతడకగా ఉంటే బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ గురించి తాను మాట్లాడనని, తాను మాట్లాడితే వారు బద్నాం చేస్తారని విమర్శించారు. జాగృతి నుంచి మాత్రం తాము ఒక నిర్ణయానికి వచ్చామని, అత్యధిక గ్రామాల్లో బీసీలు నామినేషన్లు దాఖలు చేసేలా ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో బీసీ అభ్యర్థులు గెలిచేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు.

బీసీ జేఏసీ, బీసీ హక్కుల కోసం పోరాడేవారి కార్యక్రమాల్లో తాము పాల్గొంటామని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ గద్దెలు ఉన్నంత కాలం బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు, పార్టీలు మేల్కొనాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గడానికి మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కారణమని ఆమె ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
BRS
BC Reservations
Telangana Politics

More Telugu News