Javokhir Sindarov: 19 ఏళ్లకే ఫిడే వరల్డ్ చాంపియన్... చరిత్ర సృష్టించిన సిందరోవ్

Javokhir Sindarov Wins FIDE World Cup at 19
  • చెస్ ప్రపంచకప్ విజేతగా ఉజ్బెకిస్థాన్ యువ కెరటం జవోఖిర్ సిందరోవ్
  • ఫైనల్ టైబ్రేక్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ వీ యిపై ఉత్కంఠభరిత విజయం
  • ప్రపంచకప్ గెలిచిన అతి పిన్న వయస్కుడిగా సరికొత్త చరిత్ర
  • విజయంతో 2026 క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించిన సిందరోవ్
చదరంగ ప్రపంచంలో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన యువ సంచలనం జవోఖిర్ సిందరోవ్ (19) సరికొత్త చరిత్ర సృష్టించాడు. గోవాలో బుధవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ టైబ్రేక్‌లో చైనా గ్రాండ్‌మాస్టర్ వీ యిని ఓడించి, ఫిడే చెస్ ప్రపంచకప్-2025 విజేతగా నిలిచాడు. దీంతో ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డు పుటల్లోకెక్కాడు.

ఈ టోర్నమెంట్‌లో 16వ సీడ్‌గా బరిలోకి దిగిన సిందరోవ్ ప్రయాణం అసాధారణంగా సాగింది. అనేకమంది ఫేవరెట్లు నిష్క్రమించిన ఈ టోర్నీలో, సెమీఫైనల్‌లో తన స్వదేశీయుడు నోడిర్‌బెక్ యాకుబ్బోవ్‌పై టైబ్రేక్‌లో గెలిచి ఫైనల్‌కు చేరాడు. మంగళవారం జరిగిన ఫైనల్ క్లాసికల్ గేమ్ 50 ఎత్తుల తర్వాత డ్రాగా ముగియడంతో, విజేతను తేల్చేందుకు టైబ్రేక్‌ అనివార్యమైంది.

బుధవారం జరిగిన టైబ్రేక్‌లో సిందరోవ్ అద్భుతమైన ప్రశాంతతను ప్రదర్శించాడు. రెండో 15'+10" ర్యాపిడ్ గేమ్‌లో వీ యిపై పూర్తి ఆధిపత్యం చూపి చారిత్రక విజయాన్ని అందుకున్నాడు. ఈ గెలుపుతో అతను 1,20,000 డాలర్ల (సుమారు రూ. కోటి) ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు. ఫైనల్‌కు చేరిన సిందరోవ్, వీ యి ఇద్దరూ 2026లో జరిగే క్యాండిడేట్స్ టోర్నమెంట్‌కు అర్హత సాధించారు.

గత ఏడాది కాలంలో గుకేశ్, దివ్య దేశ్‌ముఖ్ తర్వాత ప్రపంచస్థాయి టైటిల్ గెలిచిన మూడో టీనేజర్‌గా సిందరోవ్ నిలవడం విశేషం. 
Javokhir Sindarov
FIDE World Champion
Uzbekistan chess
Wei Yi
FIDE Chess World Cup 2025
chess tournament
Nodirbek Yakubboev
Goa
chess grandmaster
chess title

More Telugu News