APSDMA: దక్షిణ కోస్తాపై వాయుగుండం ఎఫెక్ట్... ఏపీఎస్డీఎంఏ అలర్ట్

APSDMA Alerts Coastal Andhra Pradesh to Cyclone Threat
  • బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం
  • రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం
  • శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
  • నెల్లూరు, తిరుపతి జిల్లాలకు ఈదురుగాలుల హెచ్చరిక
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచన
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక, హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం, ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ గురువారం నాటికి వాయుగుండంగా బలపడనుందని తెలిపింది.

ఆ తర్వాత 48 గంటల్లో ఇది మరింత బలపడి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు పయనించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో గురువారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. అలాగే శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపారు.

ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు, మలక్కా జలసంధి సమీపంలో ఏర్పడిన 'సెన్యార్' అనే తుపాను ఇప్పటికే ఇండోనేషియా వద్ద తీరం దాటినట్లు అధికారులు తెలిపారు.
APSDMA
Andhra Pradesh State Disaster Management Authority
Cyclone
Bay of Bengal
Rainfall alert
Nellore
Chittoor
Tirupati
Coastal Andhra
Rayalaseema

More Telugu News