Dharma Reddy: పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఏఈవో ధర్మారెడ్డి

Dharma Reddy Attends CID Inquiry in Parakamani Theft Case
  • తిరుమల డాలర్ల చోరీ కేసులో వేగవంతమైన దర్యాప్తు
  • నిన్న విచారణకు హాజరైన టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన
  • హైకోర్టు ఆదేశాలతో కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ
తిరుమల శ్రీవారి పరకామణి డాలర్ల చోరీ కేసు విచారణలో భాగంగా టీటీడీ మాజీ అదనపు ఈవో ధర్మారెడ్డి ఈరోజు సీఐడీ ఎదుట హాజరయ్యారు. విజయవాడలోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు. ఈ కేసులో భాగంగానే టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డిని నిన్న సీఐడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

2023 ఏప్రిల్ 7న తిరుమల పరకామణిలో 920 అమెరికన్ డాలర్లను సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో టీటీడీ విజిలెన్స్‌ విభాగంలో ఎస్సైగా ఉన్న సతీశ్ కుమార్ ఫిర్యాదుతో తిరుమల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అదే ఏడాది మే 30న రవికుమార్‌పై చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. అయితే, తదనంతర పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. డిసెంబర్ 2వ తేదీలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉంది.

ఈ కేసులో అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే, తొలుత ఫిర్యాదు చేసిన ఎస్సై సతీశ్‌ కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి విచారణ కోసం రైలులో తిరుపతి వస్తుండగా, ఆయన రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించడం ఇటీవల తీవ్ర కలకలం రేపింది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణలో పలువురు ఉన్నతాధికారులను ప్రశ్నిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Dharma Reddy
Tirumala
TTD
Parakamani
Dollar theft case
CID investigation
Bhumana Karunakar Reddy
Sathish Kumar
Tirupati

More Telugu News