Donald Trump: వైట్‌హౌస్‌లో థ్యాంక్స్‌గివింగ్ వేడుక.. రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష పెట్టిన ట్రంప్

Donald Trump Pardons Turkeys at White House Thanksgiving Ceremony
  • శ్వేతసౌధంలో ఘనంగా థ్యాంక్స్‌గివింగ్ డే వేడుకలు
  • రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించిన అధ్యక్షుడు ట్రంప్
  • వాడిల్, గోబుల్ అనే టర్కీలకు దక్కిన అభయం
  • ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెలానియా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో థ్యాంక్స్‌గివింగ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఏటా కొనసాగే సంప్రదాయంలో భాగంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు టర్కీ కోళ్లకు క్షమాభిక్ష ప్రసాదించారు. నార్త్ కరోలినాకు చెందిన వాడిల్, గోబుల్ అనే పేరున్న ఈ రెండు టర్కీలకు ఆయన అభయమిచ్చారు. అధ్యక్ష భవనంలోని రోజ్‌గార్డెన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ట్రంప్ తన అర్ధాంగి మెలానియాతో కలిసి హాజరయ్యారు.

'ది నేషనల్ థ్యాంక్స్‌గివింగ్ టర్కీ' పేరుతో నిర్వహించిన ఈ వేడుకకు వాడిల్, గోబుల్ ప్రత్యేక అతిథులుగా రావాల్సి ఉంది. అయితే, కార్యక్రమంలో వాడిల్ మాత్రమే ప్రత్యక్షంగా పాల్గొంది. అయినప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ ఈ రెండు టర్కీలకూ క్షమాభిక్ష మంజూరు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ వేడుకల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతులు, ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అమెరికాలో థ్యాంక్స్‌గివింగ్ సందర్భంగా అధ్యక్షులు టర్కీలకు క్షమాభిక్ష పెట్టడం చాలా ఏళ్లుగా ఒక ఆనవాయతీగా వస్తోంది. ఈ క్షమాభిక్షతో ఈ రెండు కోళ్లను వధించకుండా వాటిని సంరక్షిస్తారు.

అబ్రహం లింకన్ కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయాన్ని 1963లో జాన్ ఎఫ్ కెన్నడీ అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రశాంతంగా జరిగే ఈ వేడుకను ట్రంప్ తన రాజకీయ ప్రసంగానికి వేదికగా మార్చుకున్నారు.

ఈ సందర్భంగా ట్రంప్ డెమొక్రాట్లను, నేరాలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇల్లినాయిస్ గవర్నర్ జేబీ ప్రిట్జ్‌కర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, చికాగోలో నేరాలను అరికట్టడానికి తనకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. గత ఏడాది అధ్యక్ష హోదాలో జో బైడెన్ టర్కీకి క్షమాభిక్ష పెట్టింది స్వయంగా కాదని, ఆటోపెన్ (యంత్రం) ద్వారా సంతకం చేశారని, కాబట్టి ఆ క్షమాభిక్ష చెల్లదని ఒక కుట్ర సిద్ధాంతాన్ని లేవనెత్తారు.

టర్కీలకు డెమొక్రాటిక్ నేతలు చక్ షూమర్, నాన్సీ పెలోసీ పేర్లు పెట్టాలనుకున్నానని, కానీ ఒకవేళ అలా పెడితే "వారిద్దరినీ నేను ఎప్పటికీ క్షమించలేను" కాబట్టి విరమించుకున్నానని వ్యంగ్యంగా అన్నారు. 

అనంతరం ఆర్థిక వ్యవస్థపై మాట్లాడుతూ, "గుడ్ల ధరలు మార్చి నుంచి 86 శాతం తగ్గాయి. గ్యాసోలిన్ ధర త్వరలో గ్యాలన్‌కు 2 డాలర్లకు చేరువవుతుంది" అని ప్రకటించారు. అయితే, గుడ్ల ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గినా, ఇతర నిత్యావసరాల ధరలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం గ్యాసోలిన్ సగటు ధర 3.10 డాలర్లుగా ఉంది.
Donald Trump
Thanksgiving
Turkey pardon
White House
Waddle
Gobble
Melania Trump
US President
Joe Biden

More Telugu News