Chhattisgarh: అతని వల్లే మా చావు.. గోడలపై లిప్‌స్టిక్‌తో సూసైడ్ నోట్.. దంపతుల మిస్టరీ మృతి

Couple Found Dead At Home Lipstick Messages On Walls Point To Murder Suicide
  • ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లో దంపతుల అనుమానాస్పద మృతి
  • కలకలం సృష్టించిన గోడలపై లిప్‌స్టిక్‌తో రాసిన రాతలు 
  • రాజేశ్‌ విశ్వాస్ అనే వ్యక్తి వల్లే చనిపోతున్నట్లు ఆరోపణ
  • భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం
ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో దారుణమైన ఘటన వెలుగుచూసింది. అటల్ ఆవాస్ కాలనీలోని ఓ ఇంట్లో భార్యాభర్తలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. భార్య మృతదేహం మంచంపై ఉండగా, భర్త ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. గోడలపై లిప్‌స్టిక్‌తో రాసి ఉన్న సందేశాలు ఈ కేసును మరింత సంచలనంగా మార్చాయి.

వివరాల్లోకి వెళితే... 30 ఏళ్ల శివానీ తాంబే అలియాస్ నేహా, ఆమె భర్త రాజ్ తాంబే ఒక ప్రైవేట్ కంపెనీలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు వారు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో నేహా తల్లి రీనా చిన్నా వారి ఇంటికి వెళ్లింది. తలుపులు లోపలి నుంచి గడియపెట్టి ఉండటంతో బలవంతంగా తెరిచి చూడగా కుమార్తె మంచంపైనా, అల్లుడు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించడంతో షాక్‌కు గురైంది.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, ఇంట్లోని గోడలపై లిప్‌స్టిక్‌తో రాజేశ్‌ విశ్వాస్ అనే వ్యక్తి పేరు, ఫోన్ నంబర్‌ రాసి ఉంది. "రాజేశ్‌ విశ్వాస్ వల్లే మేము చనిపోతున్నాం" అని, మరోవైపు "పిల్లలూ.. ఐ లవ్యూ" అని రాసి ఉన్న సందేశాలు కనిపించాయి. భార్య ఫోన్ కాల్స్ విషయంలో భర్తకు అనుమానం పెరిగి, వారి మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.

నేహా మెడపై గీరుకున్న గాయాలు ఉండటంతో ఆమెను గొంతు నులిమి హత్య చేసి, ఆ తర్వాత రాజ్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. గదిలో లభించిన సూసైడ్ నోట్‌లో కూడా గోడలపై రాసిన ఆరోపణలే ఉన్నాయి. ఈ ఘటనపై నగర సీఎస్పీ నిమితేశ్‌ సింగ్ మాట్లాడుతూ, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చాక మరణాలకు కచ్చితమైన కారణం తెలుస్తుందని ఆయన చెప్పారు.
Chhattisgarh
Raj Thambe
Shivani Tambe
Chhattisgarh Bilaspur
Suicide note
Lipstick suicide note
Murder suicide
Rajesh Vishwas
Infidelity
Family dispute
Crime news

More Telugu News