Rapido Captain: యువతి ఎక్కిన రాపిడో బైక్ అర్ధరాత్రి బ్రేక్‌డౌన్.. తర్వాత ఏమైందంటే..!

Rapido Captain Helps Woman After Midnight Bike Breakdown
  • కంగారుపడొద్దు, నేను ఇంటికి తీసుకెళ్తానంటూ భరోసా
  • ఫోన్ టార్చ్ లైట్ సాయంతో చైన్ రిపేర్ చేసిన డ్రైవర్
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఆశా మానే పోస్ట్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన
  • డ్రైవర్‌ను గుర్తించి సత్కరిస్తామన్న రాపిడో సంస్థ
అర్ధరాత్రి ఒంటరిగా ప్రయాణించాలంటే మహిళలు భయపడే ఈ రోజుల్లో ఓ రాపిడో కెప్టెన్ చూపిన చొరవ, మానవత్వం అందరి ప్రశంసలు అందుకుంటోంది. బెంగళూరులో ఆశా మానే అనే యువతికి ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భద్రత అనేది పరిస్థితుల వల్ల కాదు, మనం కలిసే మనుషుల వల్లే వస్తుందనడానికి ఈ ఘటనే నిదర్శనం.

ఆశా మానే రాత్రి 11:45 గంటల సమయంలో 38 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు రాపిడో బుక్ చేసుకున్నారు. ఆమె ఫోన్‌లో కేవలం 6 శాతం బ్యాటరీ మాత్రమే ఉంది. ప్రయాణం మొదలైన కొద్దిసేపటికే వారి బైక్ ఓ గుంతలో పడటంతో చైన్ తెగిపోయింది. చుట్టూ నిర్మానుష్య ప్రాంతం, దగ్గర్లో మెకానిక్ షాప్ కూడా లేని ఆ సమయంలో ఆమె ఆందోళనకు గురయ్యారు.

ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా రైడ్ రద్దు చేసి వెళ్లిపోతారు. కానీ ఆ కెప్టెన్ అలా చేయలేదు. "మీరు కంగారుపడకండి, దీన్ని సరిచేసి మిమ్మల్ని ఇంటిదగ్గర దింపుతాను" అని అతను చెప్పడంతో తాను చలించిపోయానని ఆశ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ సమస్యను పరిష్కరించారు. ఆశా తన ఫోన్ టార్చ్‌ లైట్‌తో వెలుతురు చూపించగా, ఆ కెప్టెన్ 10 నిమిషాల్లోనే చైన్‌ను సరిచేశాడు. చెప్పినట్టుగానే అతను ఆమెను రాత్రి 1 గంటకు సురక్షితంగా ఇంటి దగ్గర దింపాడు.

ఈ ఘటనను వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో అది వైరల్‌గా మారింది. దీనిపై రాపిడో సంస్థ కూడా స్పందించింది. "నిజమైన హీరోలకు కేప్స్ ఉండవు. కొందరు అర్ధరాత్రి వీధిలైట్ల వెలుగులో బైక్ చైన్ సరిచేసి, మిమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేరుస్తారు. అతనికి తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తాం" అని హామీ ఇచ్చింది. ప్రయాణ భద్రతపై తరచూ నెగటివ్ కథనాలు వస్తున్న తరుణంలో, ఇలాంటి సానుకూల సంఘటనలు మానవత్వంపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.
Rapido Captain
Rapido
bike breakdown
Bangalore
Asha Mane
bike taxi
ride safety
social media
viral video

More Telugu News