Punjab Lottery: అదృష్టం అంటే ఇదే.. ఇళ్లలో పనిచేసే మహిళకు రూ.3 కోట్ల లాటరీ!

Maheshwari Sahni wins 3 Crore Lottery Working as House Help
  • కూతురి పుట్టినరోజు కోసం చెవిపోగులు తాకట్టు పెట్టి టికెట్ కొనుగోలు
  • ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న మహేశ్వరి సాహ్ని
  • గెలిచిన డబ్బుతో కూతురిని డాక్టర్‌ను చేస్తానంటున్న తల్లి
అదృష్టం తలుపు తడితే జీవితం రాత్రికిరాత్రే మారిపోతుంది. పంజాబ్‌లోని లూథియానాకు చెందిన మహేశ్వరి సాహ్ని విషయంలో ఇదే జరిగింది. ఇళ్లలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమెకు ఏకంగా రూ.3 కోట్ల లాటరీ తగిలింది. దీంతో ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.

జాగ్రాన్ గ్రామానికి చెందిన మహేశ్వరిది నిరుపేద కుటుంబం. పెళ్లయిన కొంత కాలానికే భర్త వదిలేయడంతో కష్టపడి పనిచేస్తూ పిల్లలను పోషించుకుంటోంది. కొడుకు కూడా చనిపోవడంతో కూతురితో కలిసి తల్లిగారింట్లో ఉంటోంది. ఇలాంటి కష్టాల నడుమ ఆమె జీవితంలో లాటరీ రూపంలో అదృష్టం వరించింది.

మహేశ్వరి మీడియాతో మాట్లాడుతూ, "జనవరి 17న నా కూతురి పుట్టినరోజు. తనకోసం బహుమతి కొనడానికి డబ్బుల్లేవు. అదే సమయంలో ఓ అమ్మాయికి లాటరీ తగిలిన వార్త పేపర్‌లో చూశాను. నా కూతురి పేరు మీద టికెట్ కొనాలనిపించింది. నా దగ్గర ఉన్న చెవిపోగులు తాకట్టు పెట్టి రూ.2000తో నాలుగు టికెట్లు కొన్నాను" అని వివరించింది.

ఈ నెల‌ 22న సాయంత్రం తమకు లాటరీ తగిలినట్లు తెలిసిందని, ఆ క్షణాలు తమ జీవితంలో అత్యంత ఆనందకరమైనవని ఆమె చెప్పింది. ఈ డబ్బుతో తన కూతురిని బాగా చదివించి, డాక్టర్ కావాలన్న ఆమె కలను నెరవేరుస్తానని మహేశ్వరి తెలిపింది. పేద కుటుంబానికి లాటరీ తగలడం సంతోషంగా ఉందని, అయితే ఆన్‌లైన్ లాటరీల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని లాటరీ షాప్ యజమాని సూచించారు.
Punjab Lottery
Maheshwari Sahni
Ludhiana lottery
Jagran village
Lottery winner
Indian lottery
Poverty alleviation
Daughter education
Online lottery risks
Lottery success story

More Telugu News