AMR: ప్రజారోగ్యానికి పెనుముప్పుగా యాంటీబయాటిక్స్.. యాక్షన్ ప్లాన్ విడుదల చేసిన ప్రభుత్వం

AMR Government Releases Action Plan on Antibiotic Resistance
  • యాంటీబయాటిక్స్ విచ్చలవిడి వాడకానికి చెక్
  • మందులకు లొంగని సూక్ష్మజీవుల కట్టడికి కేంద్రం కొత్త ప్రణాళిక
  • 2025-29 కాలానికి ఎన్‌ఏపీ-ఏఎంఆర్‌ 2.0 విడుదల
  • డాక్టర్ చీటీ లేకుండా యాంటీబయాటిక్స్ అమ్మకాలపై నిషేధం
ప్రజారోగ్యానికి పెను సవాలుగా మారుతున్న యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) సమస్యను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకొచ్చింది. శక్తిమంతమైన యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగని మొండి సూక్ష్మజీవుల (సూపర్‌బగ్స్) వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా 2025-2029 కాలానికి ‘నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (ఎన్‌ఏపీ-ఏఎంఆర్) 2.0’ను విడుదల చేసింది. ఈ ప్రణాళిక ప్రధానంగా ఆరు కీలక అంశాలపై దృష్టి సారించనుంది.

ఈ కొత్త విధానంలో భాగంగా యాంటీబయాటిక్స్ వాడకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించనున్నారు. పాఠశాల విద్యార్థుల నుంచి ఆరోగ్య కార్యకర్తల వరకు అందరికీ దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే సమయంలో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ అమ్మడాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. దేశవ్యాప్తంగా ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచి, ఏ ప్రాంతంలో ఏ బ్యాక్టీరియా మందులకు లొంగడం లేదనే దానిపై పటిష్ఠ నిఘా ఏర్పాటు చేస్తారు.

ఆసుపత్రుల్లో పరిశుభ్రతా ప్రమాణాలు పెంచడం ద్వారా ఇన్ఫెక్షన్ల వ్యాప్తిని అరికట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల అనవసర మందుల వాడకం తగ్గుతుంది. పాత మందులు పనిచేయని కారణంగా, కొత్త యాంటీబయాటిక్‌లు, టీకాలు, తక్కువ ఖర్చుతో కూడిన డయాగ్నస్టిక్ కిట్‌ల అభివృద్ధి కోసం పరిశోధనలను ప్రోత్సహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక నిధులు కూడా కేటాయిస్తారు. ఈ సమస్యను సమగ్రంగా ఎదుర్కోవడానికి కేవలం ఆరోగ్య శాఖే కాకుండా వ్యవసాయం, పశుసంవర్థక, పర్యావరణ శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కేంద్రం నిర్ణయించింది.
AMR
Antimicrobial Resistance
National Action Plan
Antibiotics
Superbugs
Healthcare
India
Government
Public Health
AMR Action Plan

More Telugu News