Obesity in India: ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరికి ఊబకాయం.. షాకింగ్ రిపోర్ట్!

One In Four Indian Adults Obesity Claims New Report
  • టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ నివేదికలో వెల్లడి
  • ఊబకాయం వల్ల దేశ జీడీపీకి 1శాతం నష్టం
  • పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్న సమస్య
భారత్‌లో ఊబకాయం ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది. దేశంలో ప్రతి నలుగురు వయోజనుల్లో ఒకరు స్థూలకాయంతో బాధపడుతున్నారని 'టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్' విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. ఊబకాయం సంబంధిత వ్యాధులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా పెరుగుతున్నాయని, భారత్ ఇప్పుడు ఒక కీలక దశలో ఉందని ఈ నివేదిక హెచ్చరించింది.

'బిల్డింగ్ ఆన్ సక్సెస్ టు సెక్యూర్ ఇండియాస్ ఫ్యూచర్ హెల్త్' పేరుతో మంగళవారం ఢిల్లీలో విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం దేశంలో 24 శాతం మహిళలు, 23 శాతం పురుషులు అధిక బరువు లేదా ఊబకాయంతో ఉన్నారు. 30 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది దాదాపు ఐదు రెట్లు అధికం. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2019-21) గణాంకాలను ఉటంకిస్తూ, ఢిల్లీలో 41 శాతం మహిళలు ఊబకాయంతో బాధపడుతుంటే, మేఘాలయలో ఈ సంఖ్య కేవలం 12 శాతంగా ఉంది.

ఊబకాయం వల్ల భారత ఆరోగ్య వ్యవస్థపైనే కాకుండా ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతోందని నివేదిక స్పష్టం చేసింది. దీని కారణంగా దేశం ఏటా ఆరోగ్య సంరక్షణపై సుమారు 2.4 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అదే సమయంలో ఆర్థిక ఉత్పాదకతలో దాదాపు 28.9 బిలియన్ డాలర్లు నష్టపోతోంది. ఇది దేశ జీడీపీలో దాదాపు ఒక శాతానికి సమానం.

ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే ధోరణి కొనసాగుతోందని, 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయుల సంఖ్య రెట్టింపు అయిందని నివేదిక పేర్కొంది. 'ఈట్ రైట్ ఇండియా', 'ఫిట్ ఇండియా' వంటి ప్రభుత్వ కార్యక్రమాలు ఆహారపు అలవాట్లను మెరుగుపరచడంలో సహాయపడుతున్నాయని ప్రశంసించింది. నివారణ ఆరోగ్య సంరక్షణను దేశ అభివృద్ధి వ్యూహంలో కేంద్ర భాగంగా మార్చాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. సాంకేతికత, డేటాను ఉపయోగించి ఊబకాయం సమస్యను భారత్ అధిగమించగలదని టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ కంట్రీ డైరెక్టర్ వివేక్ అగర్వాల్ తెలిపారు.
Obesity in India
India obesity rate
Tony Blair Institute
National Family Health Survey
Overweight Indians
Indian health crisis
Eat Right India
Fit India Movement
Vivek Agarwal
Obesity economic impact

More Telugu News