Nara Lokesh: ఇలాంటి కంటెంట్ వద్దు: టీడీపీ అభిమానికి నారా లోకేశ్ హితవు

Nara Lokesh Advises TDP Fan Against Negative Content
  • వైఎస్ జగన్‌పై వివాదాస్పద పోస్టుపై స్పందించిన లోకేశ్
  • వ్యక్తిగత దాడులు వద్దంటూ టీడీపీ శ్రేణులకు హితవు
  • రాజకీయాల్లో హుందాతనం, గౌరవం పాటించాలని పిలుపు
  • అలాంటి కంటెంట్‌ను ఎవరూ ప్రోత్సహించవద్దని స్పష్టమైన సూచన
రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, వ్యక్తిగత దాడులకు దూరంగా ఉండాలని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, మద్దతుదారులకు పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్‌ను కించపరిచేలా ఉన్న ఓ సోషల్ మీడియా పోస్టుపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎక్స్ వేదికగా ఓ టీడీపీ అభిమాని పోస్ట్ చేసిన వీడియోలో... ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ నడుచుకుంటూ వెళుతుండగా.. జగన్ రోడ్డు పక్కన కూర్చుని ఓ ప్లకార్డు ప్రదర్శిస్తుండడడం చూడొచ్చు. ఆ ప్లకార్డుపై "నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి" అని రాసి ఉంది. ఈ పోస్టు వైరల్ కావడంతో లోకేశ్ స్పందించారు.

"నా ప్రియమైన టీడీపీ కుటుంబానికి.. ఇలాంటి కంటెంట్ వెనుక ఉన్న భావోద్వేగాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ, వ్యక్తిగత దాడులు ఎప్పటికీ మంచివి కావు. మేం రాజకీయ ప్రత్యర్థులం కావచ్చు, కానీ మన చర్యలు గౌరవప్రదంగా ఉండాలి" అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

"మన మద్దతుదారులతో సహా ప్రతి ఒక్కరూ ఇలాంటి కంటెంట్‌ను ప్రోత్సహించవద్దని నేను అభ్యర్థిస్తున్నాను. విభేదాలు ఉన్నప్పటికీ హుందాతనాన్ని పాటిద్దాం. ఆంధ్రప్రదేశ్‌ను బలోపేతం చేసే నిర్మాణాత్మక రాజకీయాలపై దృష్టి సారిద్దాం" అని ఆయన కోరారు. రాజకీయ ప్రత్యర్థులపై అనవసరమైన ట్రోలింగ్‌కు స్వస్తి పలకాలని ఆయన పరోక్షంగా సూచించారు.
Nara Lokesh
TDP
YCP
Jagan
Chandrababu Naidu
Pawan Kalyan
Andhra Pradesh Politics
Social Media Post
Political Decorum
Trolling

More Telugu News