Komatireddy Venkat Reddy: ఆ అధ్యక్షుడిని మార్చండి!: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి ఘాటు లేఖ

Change that President Komatireddy Letter to CM Revanth Reddy
  • పున్నా కైలాశ్ తమ కుటుంబం పట్ల తీవ్ర పదజాలం ఉపయోగించారన్న మంత్రి
  • అతనిని వెంటనే డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్
  • డీసీసీ అధ్యక్షుడిగా సరై వ్యక్తికి అవకాశం ఇవ్వాలని డిమాండ్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం ఒక లేఖ రాశారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడిని వెంటనే మార్చాలని ఆయన ఆ లేఖలో డిమాండ్ చేశారు. ఇటీవల జిల్లా అధ్యక్షుల నియామకంలో భాగంగా నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా నియమించబడిన పున్నా కైలాశ్ గతంలో తన పట్ల, తన కుటుంబం పట్ల తీవ్ర పదజాలం ఉపయోగించారని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.

అలాంటి వ్యక్తిని తక్షణమే డీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మీడియా ముందు తమను అసభ్య పదజాలంతో దూషించి అవమానించారని, సామాజిక మాధ్యమాలలో కూడా ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఇది తమ కుటుంబాన్ని బాధించిందని అన్నారు. ఈ మేరకు ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. అలాగే, అతనిని తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా సరైన వ్యక్తికి అవకాశం ఇవ్వాలని కోరారు. మరోవైపు, కొత్త డీసీసీ అధ్యక్షుడు కైలాశ్‌కు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్దతు తెలిపారు.
Komatireddy Venkat Reddy
Revanth Reddy
Nalgonda DCC
Telangana Congress

More Telugu News