Adi Srinivas: కూలిన బేస్‌మెంట్.. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమకు తప్పిన ప్రమాదం

Adi Srinivas Narrow Escape as Basement Collapses During Inspection
  • గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్ల సందర్శనకు వెళ్లిన ఎమ్మెల్యే
  • డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేస్తుండగా కూలిన బేస్‌మెంట్
  • కిందపడిపోకుండా పట్టుకున్న అధికారులు, సహాయకులు
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్, ఇతర అధికారులకు పెను ప్రమాదం తృటిలో తప్పింది. వేములవాడలో గృహ నిర్మాణ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను సందర్శించడానికి వారు వెళ్లారు. వేములవాడ మున్సిపల్ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను తనిఖీ చేస్తుండగా బేస్‌మెంట్ కూలిపోయింది. సహాయకులు, అధికారులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే కింద పడకుండా పట్టుకున్నారు.

ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి ఈ బేస్‌మెంట్ కూలడమే నిదర్శనమని బీఆర్ఎస్ ఆరోపించింది. బీఆర్ఎస్ విమర్శలపై ఆది శ్రీనివాస్ సైతం స్పందించారు.

బీఆర్ఎస్ హయాంలో ఆమోదించబడిన కాంట్రాక్టర్లు ఈ ఇంటిని నిర్మించారని ఆది శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అన్నీ నాసిరకం పనులే జరిగాయనడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బేస్‌మెంట్ మీద నిలబడిన వెంటనే అది కూలిపోయిందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో అడ్డదారిలో డబ్బులు దోచుకోవడానికి, కమీషన్లు పొందడానికి నాణ్యత లేని పనులు చేశారని ఆరోపించారు.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బేస్‌మెంట్ నిర్మాణం చేపట్టారని అన్నారు. ఆ నిర్మాణాన్ని కూడా మధ్యలోనే వదిలేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినందున ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించామని, అందులో భాగంగానే కలెక్టర్‌, అధికారులతో కలిసి తాను తనిఖీలకు వెళ్లానని ఆది శ్రీనివాస్ తెలిపారు.

బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన బ్యారేజీలు కూడా కూలిపోయాయని ఆరోపించారు. తమ ప్రభుత్వం వీలైనంత త్వరగా ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తుందని హామీ ఇచ్చారు.
Adi Srinivas
Vemulawada
Telangana
Double bedroom houses
House collapse

More Telugu News