Srinivas IPS: భార్య ఇచ్చిన సమాచారంతోనే ఐ-బొమ్మ రవి పట్టుబడ్డాడా?... పోలీసులు ఏం చెబుతున్నారంటే...!

Cyber Crime Additional CP Srinivas Clarifies on I Bomma Ravi Case
  • కస్టడీలో ఐ-బొమ్మ రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు వెల్లడి
  • ఐ-బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ద్వారా రవి సినిమాలను పోస్టు చేసేవాడన్న సీపీ
  • మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ వెబ్‌సైట్లు ఇప్పటికీ నడుస్తున్నట్లు వెల్లడి
భార్య ఇచ్చిన సమాచారంతోనే ఐ-బొమ్మ రవి పట్టుబడ్డాడనే ప్రచారంలో వాస్తవం లేదని, ఆమెను పోలీసులు విచారించనే లేదని సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఐ-బొమ్మ రవి కేసు వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. కస్టడీలో రవి నుంచి కీలక విషయాలు రాబట్టామని తెలిపారు. ఐ-బొమ్మ వెబ్‌సైట్‌ను రవి మరో కంపెనీ నుంచి హోస్ట్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు.

డొమైన్‌ను ఓ వెబ్ హోస్టింగ్ కంపెనీలో రిజిస్టర్ చేశాడని, కంటెంట్ మేనేజ్‌మెంట్ సిస్టం ద్వారా రవి సినిమాలు పోస్టు చేసేవాడని తెలిపారు. ఐ-బొమ్మ, బప్పం వెబ్‌సైట్ల ద్వారా రవి సినిమాలను పోస్టు చేసేవాడని, ఆయా వెబ్ సాఫ్ట్‌వేర్‌లలో రీడైరెక్ట్ స్క్రిప్ట్ రాశాడని వెల్లడించారు. దీని ద్వారా గేమింగ్, బెట్టింగ్ వెబ్‌సైట్లకు మళ్ళించేవాడని అన్నారు. మూవీరూల్జ్ వంటి పైరసీ వెబ్‌సైట్లు ఇంకా నడుస్తున్నాయని ఆయన తెలిపారు.

భవిష్యత్తులో వెబ్-3 సాంకేతికత రానుందని, దాని ద్వారా పైరసీ చేస్తే పట్టుకోవడం కష్టమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఐ-బొమ్మ రవి అతి విశ్వాసంతో ఉన్నాడని, పైరసీ వ్యవహారాల దర్యాప్తు సంక్లిష్టంగా ఉంటుందని అన్నారు. ఐ-బొమ్మ రవి ఒంటరిగా ఉంటూ, వారానికో దేశం చొప్పున తిరిగేవాడని, ఈజీ మనీకి అలవాటు పడ్డాడని, లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కూడా కొనుగోలు చేశాడని తెలిపారు.

నిఖిల్ అనే వ్యక్తి అతని వెబ్‌సైట్లకు పోస్టర్లు డిజైన్ చేసేవాడని అన్నారు. మన చట్టాల ప్రకారం విదేశీయులు ఇక్కడ నేరం చేస్తే అది నేరమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు. నేరగాళ్ల అప్పగింతపై పలు దేశాలతో మనకు సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు.

ఐ-బొమ్మ పాపులర్ అయ్యాక చాలామంది ఆ పేరును వాడుకుంటున్నారని, సినిమా సమీక్షలకు కూడా ఆ వెబ్‌సైట్ పేరును ఉపయోగిస్తున్నారని ఆయన అన్నారు. ఐ-బొమ్మ రవి సుమారు రూ.20 కోట్ల వరకు సంపాదించాడని అంచనా వేశామని తెలిపారు. మూవీరూల్జ్, తమిళ్ఎంవీ లాంటి పైరసీ వెబ్‌సైట్లు నిర్వాహకులను పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు.
Srinivas IPS
I-Bomma Ravi
Cyber Crime
Movie piracy
TamilMV
MovieRulz

More Telugu News