Atchannaidu: ముంచుకొస్తున్న మరో తుపాను... రైతులను అప్రమత్తం చేసిన అచ్చెన్నాయుడు

Atchannaidu Urges Farmers to Protect Harvest Amid Cyclone Alert
  • దక్షిణ అండమాన్ సముద్రంలో తీవ్ర అల్పపీడనం
  • 48 గంటల్లో తుపానుగా మారే అవకాశం 
  • పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని రైతులకు అచ్చెన్న సూచన
రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, వాయుగుండంగా మారి రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

పంట నష్టం జరగకుండా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు. ముఖ్యంగా వరి కోతలు పూర్తిచేసిన రైతులు, తమ ధాన్యాన్ని తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేశారు. ధాన్యం తడవకుండా కాపాడుకునేందుకు ప్రభుత్వం తరఫున రైతులకు ఉచితంగా టార్పలిన్ పట్టాలు పంపిణీ చేస్తున్నామని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రైతులు జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించి వాటిని పొందవచ్చని తెలిపారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆదేశించారు.

సముద్రం అలజడిగా ఉన్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని మంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి తిరిగి రావాలని ఆదేశించారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. 
Atchannaidu
Andhra Pradesh
Cyclone warning
Farmers safety
Fishermen warning
Kinjarapu Atchannaidu
Agriculture minister
Bay of Bengal cyclone
Paddy crops
Weather alert

More Telugu News