SKN: ప్రేక్షకుడు రూపాయి ఖర్చు చేస్తే అందులో నిర్మాతకు దక్కేది 17 పైసలే!: నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర విశ్లేషణ

Producer SKN Analysis on Revenue Share in Movie Tickets
  • మల్టీప్లెక్స్ లు, నిర్మాతల ఆదాయంపై ఎస్కేఎన్ స్పందన 
  • రూపాయిలో 71 పైసలు మల్టీప్లెక్స్ లకే వెళుతున్నాయని వెల్లడి
  • సినిమా వాళ్లు దోచుకుంటున్నారన్నది కరెక్ట్ కాదని స్పష్టీకరణ
ఒక కుటుంబం మల్టీప్లెక్స్‌లో సినిమా చూడటానికి వెళితే, వారు పెట్టే ఖర్చులో సినిమా తీసిన నిర్మాతకు ఎంత వాటా దక్కుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? అంటూ టాలీవుడ్ యువ నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తికర విశ్లేషణను అందించారు. ప్రేక్షకుడు ఖర్చు చేసే ప్రతి రూపాయిలో నిర్మాతకు కేవలం 17 పైసలు మాత్రమే అందుతున్నాయని, దాదాపు 71 పైసలు, మల్టీప్లెక్స్‌లకే వెళుతున్నాయని ఎస్కేఎన్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

"నేనొక సినీ నిర్మాతను. మీరు సినిమాను ఎంతగా ప్రేమిస్తారో, ఆదరిస్తారో మాకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో థియేటర్‌కు కుటుంబంతో కలిసి రావాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. టికెట్ ధరలు, అక్కడి తినుబండారాల రేట్లు చూసి మమ్మల్ని, అంటే నిర్మాతల్నే మీరు నిందిస్తుంటారు. "సినిమా వాళ్లు దోచుకుంటున్నారు" అనే మాట వినిపిస్తుంటుంది. కానీ అందులో నిజమెంత? మీరు థియేటర్‌లో ఖర్చుపెట్టే డబ్బులో ఎవరి వాటా ఎంతో మీకు తెలియజేయాలనే ఈరోజు మీ ముందుకు వచ్చాను.

ఒక చిన్న ఉదాహరణతో అసలు విషయం వివరిస్తాను. నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం సినిమాకి వెళ్లి, టికెట్లు, తినుబండారాలు అన్నింటికీ కలిపి మొత్తం రూ. 2,178 ఖర్చు చేసిందనుకుందాం. ఆ డబ్బు ఎవరెవరికి వెళ్లిందో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.

మీరు ఖర్చు చేసిన ఆ రూ. 2,178లో సింహభాగం, అంటే దాదాపు 71 శాతం (రూ. 1,545), నేరుగా మల్టీప్లెక్స్ యాజమాన్యానికి వెళ్ళింది. ఇందులో వారి టికెట్ వాటా, నిర్వహణ రుసుము ఉన్నప్పటికీ, అత్యధిక మొత్తం తినుబండారాల (F&B) అమ్మకాల ద్వారానే వారికి చేరింది. ఇక ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో 8.36 శాతం, అంటే రూ. 182 వెళ్ళింది. మీరు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్నందుకు బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌కు (BMS వంటివి) సుమారు 3.61 శాతం, అంటే రూ. 78 కన్వీనియన్స్ ఫీజుగా వెళ్ళింది. ఈ రుసుముతో మాకు ఎలాంటి సంబంధం లేదు, పైగా ఇది ప్రేక్షకులకు అదనపు భారం.

ఇవన్నీ పోగా, సినిమా తీయడానికి కోట్లాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి, సృజనాత్మక శ్రమనంతా ధారపోసి, సినిమా విజయం సాధిస్తుందో లేదోనని గుండె అరచేతిలో పెట్టుకుని ఎదురుచూసే మా లాంటి నిర్మాతలకు దక్కింది ఎంత అనుకుంటున్నారు? కేవలం 17.08 శాతం. అంటే మీరు పెట్టిన రూ. 2,178లో మాకు చేరింది కేవలం రూ. 372 మాత్రమే.

ఒక్క మాటలో చెప్పాలంటే, మీరు థియేటర్‌లో ఖర్చుపెట్టే ప్రతి రూపాయిలో సినిమా తీసిన మాకు కేవలం 17 పైసలు వస్తుండగా, సినిమాను ప్రదర్శించే మల్టీప్లెక్స్‌లకు, మధ్యవర్తిత్వ సంస్థలకు, ప్రభుత్వానికి కలిపి 83 పైసలు వెళుతున్నాయి.

ఈ లెక్కలు చెప్పి ఎవరినీ తప్పుబట్టాలని కాదు. వ్యవస్థలో ఉన్న లోపాలను, అసమతుల్యతను మీ దృష్టికి తీసుకురావడమే నా ఉద్దేశం. సినిమాను సామాన్యుడికి దూరం చేస్తున్నది ఎవరు? ఈ ఖరీదైన వ్యవస్థలో నష్టపోతున్నది ఎవరు? అనే విషయాలపై అవగాహన కల్పించాలన్నదే నా తపన. ఈ వాస్తవాలు తెలిసినప్పుడే, సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న నిజమైన సవాళ్లు మీకు అర్థమవుతాయని ఆశిస్తున్నాను" ఎస్కేఎన్ అని సోదాహరణంగా వివరించారు. 
SKN
Producer SKN
Telugu cinema
Tollywood
Movie tickets price
Multiplex charges
Movie budget
Film industry
GST on movies
Movie economics

More Telugu News