West Bengal: నీళ్లు అనుకుని యాసిడ్‌తో వంట.. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురి పరిస్థితి విషమం

West Bengal Acid Incident Six Sick After Acid Mistaken for Water
  • పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో ఘటన
  • వంటలో నీళ్లకు బదులు యాసిడ్ వాడటంతో ఘోరం
  • పరిస్థితి విషమంగా ఉండటంతో కోల్‌కతాకు తరలింపు
  • వెండి పని కోసం ఇంట్లో ఉంచిన యాసిడ్‌తో ప్రమాదం
పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. వంట చేసే క్రమంలో నీళ్లకు బదులుగా పొరపాటున యాసిడ్ వాడటంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కోల్‌కతాలోని ఆసుపత్రికి తరలించారు.

పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని రత్నేశ్వర్‌బతి గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి చెందిన సంతు అనే వ్యక్తి వెండి పనులు చేస్తుంటాడు. తన వృత్తిలో భాగంగా వెండిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే యాసిడ్‌ను ఇంట్లో ఒక పాత్రలో నిల్వ ఉంచాడు. అయితే, ఆ పాత్ర చూడటానికి నీళ్లు నింపే కంటైనర్‌లా ఉండటంతో కుటుంబ సభ్యులు పొరబడ్డారు.

ఆదివారం మధ్యాహ్నం ఇంట్లోని ఓ మహిళ వంట చేసేటప్పుడు నీళ్లు అనుకుని ఆ యాసిడ్‌ను వాడేశారు. ఆ ఆహారాన్ని తిన్న వెంటనే కుటుంబ సభ్యులందరికీ కడుపులో తీవ్రమైన నొప్పి, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో వారిని హుటాహుటిన సమీపంలోని ఘటల్ ఆసుపత్రికి తరలించారు.

బాధితులను పరీక్షించిన వైద్యులు, యాసిడ్ కలిసిన ఆహారం తినడం వల్లే వారు అస్వస్థతకు గురయ్యారని నిర్ధారించారు. ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, వారిలో ఒక చిన్నారి పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండటంతో ఆరుగురినీ కోల్‌కతాలోని పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేశారు. 
West Bengal
Acid Incident
Food Poisoning
Midnapore District
Kolkata Hospital
Children Affected
Accidental Poisoning
Family Emergency

More Telugu News