Dodda Ganesh: ఇంత అయోమయంలో ఉన్న భారత టెస్టు జట్టును చూడలేదు: మాజీ పేసర్ ఫైర్

Dodda Ganesh Fires at Indian Test Team Management Decisions
  • వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పుపై విమర్శలు
  • నంబర్ 3 నుంచి 8వ స్థానానికి పంపిన జట్టు యాజమాన్యం
  • ఇంత గందరగోళంలో ఉన్న జట్టును చూడలేదన్న దొడ్డ గణేశ్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత జట్టు యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా జట్టులో కీలకమైన నంబర్ 3 బ్యాటింగ్ స్థానంపై తీవ్ర గందరగోళం నెలకొంది. తొలి టెస్టులో అనూహ్యంగా స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ఈ స్థానంలో పంపిన టీమ్ మేనేజ్‌మెంట్.. గువాహ‌టిలో జరుగుతున్న రెండో టెస్టులో మరో వింత నిర్ణయం తీసుకుంది. సాయి సుదర్శన్‌ను జట్టులోకి తీసుకుని నంబర్ 3లో ఆడిస్తూ, గత మ్యాచ్‌లో రాణించిన సుందర్‌ను ఏకంగా 8వ స్థానానికి పంపింది.

ఈ మార్పులపై భారత మాజీ పేసర్ దొడ్డ గణేశ్ తీవ్రంగా స్పందించాడు. "గత టెస్టులో నంబర్ 3 స్థానంలో వచ్చి రెండు నాణ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడిన వాషింగ్టన్ సుందర్‌ను.. తర్వాతి టెస్టులో నేరుగా 8వ స్థానానికి పంపారు. ఇంత గందరగోళంలో ఉన్న భారత టెస్టు జట్టును నేనెప్పుడూ చూడలేదు" అని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా విమ‌ర్శించాడు.

సోమవారం మూడో రోజు ఆటలో ఈ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరుకు సమాధానంగా.. భారత జట్టు 201 పరుగులకే కుప్పకూలింది. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), కెప్టెన్ రిషభ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6) వంటి కీలక బ్యాటర్లు విఫలమయ్యారు.

ఒక దశలో 122 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును.. బ్యాటింగ్‌లో డిమోట్ అయిన వాషింగ్టన్ సుందరే ఆదుకున్నాడు. అతను కుల్దీప్ యాదవ్‌తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 72 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. సుందర్ (48), కుల్దీప్ (19) పట్టుదలగా ఆడటంతో భారత్ 200 పరుగుల మార్కు దాటగలిగింది. వారిద్దరూ ఔటయ్యాక, దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. స‌ఫారీ జట్టు బౌలర్లలో మార్కో యాన్సెన్ 6 వికెట్లతో చెలరేగగా, సైమన్ హార్మర్ 3 వికెట్లు పడగొట్టాడు.
Dodda Ganesh
India vs South Africa
IND vs SA
Washington Sundar
Sai Sudharsan
Indian Cricket Team
Test Series
Cricket
Marco Jansen
Simon Harmer

More Telugu News